Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తో పాకిస్తాన్ భగ్గుమంది. నిన్న ఇస్లామాబాద్ లో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత నుంచి ఆ దేశంలోని అన్ని నగరాల్లో, పట్టణాల్లో పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. లాహోర్, ఇస్లామాబాద్, క్వెట్టాలోని ఆర్మీ కంటోన్మెంట్లపై దాడులు చేశారు. ఇదిలా ఉంటే అల్లర్లను అణిచివేయడానికి పాక్ ప్రభుత్వం అక్కడ ఇంటర్నెట్, సోషల్ మీడియాను బ్లాక్ చేసింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సును సైన్యం తన ఆధీనంలోకి తీసుకున్నట్లు పాక్ మీడియా చెబుతోంది. పంజాబ్ ఇమ్రాన్ ఖాన్ సొంత రాష్ట్రం. అల్లర్లను అణిచివేసేందుకు భద్రతా బలగాలు జరిపిన దాడుల్లో ఆరుగురు మరణించారు.
Read Also: Matrimonial frauds: మ్యాట్రిమోని వెబ్‌సైట్ ద్వారా పరిచయమ్యాడు.. నగలతో ఉడాయించాడు..
అయితే ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఉపయోగించుకునేలా పునరుద్దరించాలని ‘‘పాకిస్తాన్ టెలీకమ్యూనికేషన్ అథారిటీ’’కి అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విజ్ఞప్తి చేసింది. శాంతియుతంగా కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలు హింసాత్మక రూపు దాల్చేలా కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని పీటీఐ నేతలు ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ పై తమ తదుపరి కార్యాచరణ కోసం పార్టీ ఉపాధ్యక్షుడు షా మొహమ్మద్ ఖురేషి నేతృత్వంలోని ఆరుగురు సీనియర్ నేతలతో కమిటీ ఏర్పాటైంది.
ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, కరాచీ, ఫైసలాబాద్, గుజ్రాన్ వాలా, ముల్తాన్, పెషావర్, మర్దాన్ నగరాల్లో ఆందోళనలు మిన్నంటాయి. రాజధాని ఇస్లామాబాద్ లో పెద్ద ఎత్తున పీటీఐ కార్యకర్తలు ఆందోళల్ని నిర్వహిస్తున్నారు. నిరసనల్లో భాగంగా 25 పోలీసుల వాహనాలు, 14 ప్రభుత్వ భవనాలను ధ్వంసం అయ్యాయి. 130 మంది పోలీసులు గాయపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రాబీబీ పేరున ఉన్న ‘‘ అల్ ఖదీర్ ట్రస్ట్’’లో అవినీతి ఆరోపణలపై ‘నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో’ ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసింది.