శ్రీలంక ఆందోళనలతో అట్టుడుకుతోంది. శనివారం మొదలైన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. అధ్యక్షుడు గోటబయ రాజీనామా చేయాలని ఆాందోళనకారులు ప్రెసిడెంట్ భవనాన్ని దిగ్భందించారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికారిక నివాసాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. దీంతో పాటు రెండు నెలల క్రితం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘే కూడా రాజీనామా చేశారు. దీంతో శాంతించని జనాలు ప్రధాని ప్రైవేట్ నివసానికి నిప్పు పెట్టారు. ప్రెసిడెంట్ ప్యాలెస్ ను ఆక్రమించుకున్న నిరసనకారుల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే ప్రజా ఉద్యమానికి శ్రీలంక మాజీ స్టార్ క్రికెటర్లు మద్దతుగా నిలుస్తున్నారు. మాజీ స్టార్ క్రికెటరట్ సనత్ జయసూర్య నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ‘ గో గోట’ అని నినదిస్తూ.. అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను ఎల్లప్పుడు శ్రీలంకకు అండగా ఉంటానని.. త్వరలో ప్రజలు విజయం సాధిస్తారని జయసూర్య అన్నారు. దీంతో పాటు మరో మాజీ స్టార్ బ్యాటర్ కుమార సంగక్కర కూడా ప్రజా ఉద్యమానికి మద్దతు తెలిపారు. ట్విట్టర్ లో ఆందోళన చేస్తున్న ప్రజలు వీడియోను పోస్ట్ చేశారు. ఇది మన భవిష్యత్ కోసం అంటూ కామెంట్ చేశారు. ‘గో గోట హోమ్’ హాష్ ట్యాగ్ తో ప్రజాశక్తి అని మాజీ స్టార్ క్రికెటర్ మహేళ జయవర్థనే ట్వీట్ చేశారు.
Read Also: Lal Singh Chadda: ‘ఈ సినిమాతో అమీర్ కెరీర్ ముగిసిపోతుంది’
శ్రీలంక వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. నిరసనల్లో ఇప్పటి వరకు ఇద్దరు పోలీస్ అధికారులతో పాటు 30 మంది వ్యక్తుల గాయపడ్డారు. నిన్న ప్రారంభంమైన నిరసనల్లో ఆస్ట్రేలియా- శ్రీలంక టెస్ట్ మ్యాచ్ జరుగుతన్న గాలే క్రికెట్ స్టేడియాన్ని ముట్టడించారు. ప్రపంచం చూపును ఆకర్షించేలా నిరసనలు తెలిపారు. శ్రీలంకలో గత మార్చి నుంచి ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1948 నుంచి ఇలాంటి ఆర్థిక సంక్షోభాన్ని శ్రీలంక ఎప్పుడూ చూడలేదు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్, డిజిల్ కోసం రోజుల తరబడి క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం పెట్రోల్ కూడా కొనడానికి శ్రీలంక వద్ద విదేశీమారక నిల్వలు లేవు. వీటన్నింటికి కారణం గోటబయ కుటుంబం అవినీతే అని ప్రజలు ప్రభుత్వంపై తిరగబడ్డారు. దీంతో గతంలో ప్రధానిగా పనిచేసిన మహిందా రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా అధ్యక్షుడు దేశం విడిచిపారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.