శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవుల రాజధాని మాలే నుంచి సింగపూర్ పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక నుంచి మాల్దీవులకు పారిపోయారు గొలబాయ రాజపక్స. ఆయన భార్య ఇద్దరు బాడీగార్డులతో ఆయన మాలే చేరుకున్నారు. ఇదిలా ఉంటే అధ్యక్షుడు పారిపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారులు ఆందోళనలను ఇంకా పెంచారు. ఏకంగా ప్రధాని, తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే నివాసాన్ని ముట్టడించారు. దీంతో విక్రమసింఘే శ్రీలంక వ్యాప్తంగా ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. పశ్చిమ ప్రాంతంతో పాటు రాజధాని కొలంబోలో కర్ఫ్యూను విధించారు.
ఇదిలా ఉంటే మాల్దీవుల్లో ఉన్న గొటబాయ రాజపక్సకు అక్కడ కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీలంక ప్రజలు గొటబాయను తిరిగి శ్రీలంకకు అప్పగించాలని నిరసన తెలుపుతున్న నేపథ్యంలో ఆయన సింగపూర్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మాలే నుంచి సింగపూర్ వెళ్లాల్సిన సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సింగపూర్ బయలుదేరాల్సి ఉన్నా.. భద్రతా కారణాల వల్ల సింగపూర్ వెళ్లలేదని తెలుస్తోంది. దీంతో ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా సింగపూర్ బయలుదేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
Read Also: Parliament Monsoon Session 2022: ఈనెల 18న వర్షాకాల సమావేశాలు.. అదేరోజు రాష్ట్రపతి ఎన్నిక
మరోవైపు బుధవారం రాజీనామా చేస్తానని వెల్లడించిన రాజపక్స ఇప్పటి వరకు తన రాజీనామాను అందించలేదు. దీంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. రాజపక్సను శ్రీలంకకు అప్పగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆందోళనలు అణచివేయడానికి శ్రీలంక ఆర్మీ, పోలీసులకు తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఆదేశాలు ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే జూలై 20న పార్లమెంట్ ఓటింగ్ ద్వారా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నట్లు పార్లమెంట్ స్పీకర్ మహింద యాపా అబేవర్థన్ తెలిపారు.