Israel: ఇండియా నుంచి ఇజ్రాయిల్‌కి ఆయుధాలను తీసుకెళ్తున్న నౌకను తమ నౌకాశ్రయంలో లంగరు వేయడానికి స్పెయిన్ అంగీకరించలేదు. మారియాన్ డానికా అనే డానిష్ జెండాతో ఉన్న ఓడకు అనుమతి నిరాకరించింది. నాటో కూటమిలో సభ్యదేశంగా ఉన్న స్పెయిన్ ఇలా చేయడం సంచలనంగా మారింది. భారతదేశం నుంచి ఇజ్రాయిల్‌లోని హైఫా నౌకాశ్రయానికి 27 టన్నుల పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్నట్లు ఎల్ పైస్ వార్తా పత్రిక నివేదించింది. ఈ నౌక చెన్నై నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. స్పెయిన్ ఆగ్నేయ ఓడరేవు కార్టజేనా వద్దకు ఆయుధాలతో కూడిన ఇజ్రాయిల్‌కి వెళ్లే ఓడకు స్పెయిన్ అనుమతి నిరాకరించిందని ఆ దేశ రవాణా శాఖ మంత్రి ఆస్కార్ పుయెంటే గురువారం తెలిపారు.
‘‘ మేము ఇలా చేయడం ఇదే తొలిసారి. ఎందుకంటే ఇజ్రాయిల్‌కి ఆయుధాలను రవాణా చేస్తున్న ఓడను మేము గుర్తించడం ఇదే మొదటిసారి. ఇది స్పానిష్ ఓడరేవులో డాక్ చేయాలని అనుకున్నారు. ఇజ్రాయిల్‌కి ఆయుధాలను తీసుకెళ్లే ఏ ఓడకైనా ఇదే స్థిరమైన విధానం. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక స్పష్టమైన కారణంతో క్రమపద్ధతిలో నిరాకరిస్తుందని, మధ్యప్రాశ్యానికి మరింత ఆయుధాలు అవసరం లేదని, శాంతి కావాలి’’ అని స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయల్ ఆల్బరేస్ చెప్పారు.
Read Also: Hyd -Vijayawada Highway : హైదరాబాద్-విజయవాడ హైవేపై ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రదేశాలు ఇవే..!
స్పెయిన్‌లో అధికారంలో ఉన్న వామపక్ష కూటమి ఒత్తిడి నేపథ్యంలో ఈచర్య వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ ఓడ ఇజ్రాయిల్ కాకుండా చెక్ రిపబ్లిక్ వెళ్లిందని ఆ దేశ రవాణా మంత్రి ఆస్కార్ ఫ్యూయెంటే మరో ప్రకటనలో పేర్కొన్నాడు. అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో సభ్య దేశంగా ఉన్న స్పెయిన్ నుంచి ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా ఈ చర్య వచ్చింది. గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని స్పెయిన్ నిరంతరం వివర్శిస్తూనే ఉంది. పాలస్తీనా దేశాన్ని గుర్తించాలని యూరోపియన్ దేశాలను కోరుతోంది.
అక్టోబర్ 7 న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మంది చంపేయడమే కాకుండా, 240 మందిని బందీలుగా పట్టుకున్నారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడుతోంది. తాజాగా ఇజ్రాయిల్ ఈజిప్టు బోర్డర్‌లోని రఫాను కూడా ఆక్రమించింది. హమాస్‌ని పూర్తిగా తుదముట్టేంచే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 35,774 మంది పాలస్తీనియన్లు మరణించారు.