ఒకవైపు కరోనా మహమ్మారి , మరోవైపు ఆర్థిక సవాళ్లు ..ఈనేపథ్యంలో పోర్చుగల్‌లోని సోషలిస్ట్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోమారు విజయపరంపర కొనసాగిస్తోంది. కోవిడ్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పోర్చుగల్ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు యూరోపియన్ యూనియన్ వందల కోట్ల యూరోల సాయాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సోషలిస్టుపార్టీ మరోమారు విజయం సాధించడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. 230 సీట్లున్న పార్లమెంటులో సోషలిస్టులు 106 సీట్లు గెలుచుకున్నారు. మరికొన్ని సీట్లు వస్తే పూర్తి మెజారిటీ సాధ్యం అవుతుంది.
ఈ ఎన్నికల్లో 98.5 శాతం ఓట్లను లెక్కించగా ఇందులో సోషలిస్టులు 41 శాతం ఓట్లు సాధించారు. సోషలిస్టుల ప్రధాన ప్రత్యర్థి సెంటర్–రైట్ సోషల్ డెమోక్రటిక్ పార్టీకి 28 శాతం ఓట్లు వచ్చాయి. ఈ పార్టీ 65 పార్లమెంటరీ స్థానాలను గెలుచుకుంది. దేశంలోని 1.08 కోట్ల అర్హులైన ఓటర్లలో ఈ దఫా విదేశాల్లో నివసిస్తూ మెయిల్ ద్వారా ఓటు వేసే 15 లక్షల మందిని అంగీకరించలేదు.
మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ప్రధాని ఆంటినో కోస్టా. ఈ సందర్భంగా ఆయనకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పోర్చుగల్‌తో బలమైన బంధాన్ని కావాలని భారత్ కోరుకుంటోందన్నారు. ప్రస్తుతానికి 106 సీట్లు తెచ్చుకున్న సోషలిస్టు పార్టీ మరికొన్ని చిన్నపార్టీల సాయం తీసుకుంటుందని భావిస్తున్నారు.
కీలకమయిన సంక్షోభ సమయంలో కొత్త ప్రభుత్వంపై అంచనాలు ఎక్కువగానే వున్నాయని చెప్పాలి. పేదదేశం అయిన పోర్చుగల్ కి ఈయూ 5000 కోట్ల డాలర్ల సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. వీటిలో ఎక్కువభాగం మౌలిక సదుపాయాలు కోసం ఉద్దేశించారు. మిగిలిన మొత్తాన్ని ప్రైవేట్ కంపెనీలకు అందిస్తారు. 2015లో అధికారంలోకి వచ్చింది సోషలిస్టు పార్టీ. అయితే బడ్జెట్‌ను ఆమోదింప చేసుకునేందుకు మిత్రపక్షాలైన లెఫ్ట్ బ్లాక్, పోర్చుగీస్ కమ్యూనిస్ట్ పార్టీలపై సోషలిస్టు పార్టీ ఆధారపడుతోంది.
సోషలిస్టు పార్టీతో పాటు దేశంలో ఈసార చేగా అనే పార్టీ సత్తా చూపింది. మూడేళ్ళ క్రితం దేశంలో ఆవిర్భవించిన ప్రజాకర్షక మరియు జాతీయవాద పార్టీ చేగా ఈ ఎన్నికల్లో 5– 8 శాతం ఓట్లను సాధించింది. గత ఎన్నికల్లో ఈ పార్టీ కేవలం ఒక్క సీటు సాధించింది. ఈ ఎన్నికల్లో 46– 51 శాతం మధ్య పోలింగ్ నమోదైంది. గతంలో కంటే పోలింగ్ శాతం తగ్గింది.