విమానం వెనుక భాగానికి స్కైడైవర్ పారాచూట్ చిక్కుకుపోయిన సంఘటన తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. సుమారు 15 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేస్తున్న సమయంలో ఓ స్కైడైవర్ పారాచూట్ విమానం వెనుక భాగానికి తాకి చిక్కుకుపోయింది. దీంతో అతడు గాల్లోనే వేలాడుతూ కనిపించడంతో అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని దక్షిణ కెయిర్న్స్ ప్రాంతంలో చోటుచేసుకోగా, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే.. స్కైడైవింగ్ సమయంలో అనూహ్యంగా పారాచూట్ పూర్తిగా తెరుచుకోకపోవడంతో అది గాలి వేగానికి విమానం వెనుక భాగంలో చిక్కుకుపోయింది. ఈ ప్రమాదకర పరిస్థితిలో స్కైడైవర్ ప్రాణాలు తీవ్ర ప్రమాదంలో పడినప్పటికీ, పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా నియంత్రించాడు. స్కైడైవింగ్ ప్రక్రియలో భాగంగా స్కైడైవర్స్ ఒక్కొక్కరుగా కిందకు దూకుతుండగా, ఓ స్కైడైవర్ దూకే ప్రయత్నంలో అతడి పారాచూట్ అనూహ్యంగా తెరుచుకుని ఈ ప్రమాదం జరిగింది.
క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో స్కైడైవర్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. అయితే తన వద్ద ఉన్న అదనపు (రిజర్వ్) పారాచూట్‌ను వినియోగించి సురక్షితంగా కిందకు దిగగలిగాడు. అదే సమయంలో పైలట్ నైపుణ్యంతో విమానాన్ని కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Skydiver’s parachute snags on plane’s tail, leaving him dangling 15,000 ft above North Queensland, Australia. pic.twitter.com/gptG8Y0tWx
— Goon (@EnsignAshes) December 11, 2025