గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. కరోనా వైరస్ కొత్తకొత్తగా రూపాంతరాలు చెందుతూ మానవ జాతిపై విరుచుకుపడుతోంది. కరోనా కట్టడికి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు అధ్యయనాలు చేస్తూ కొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. కరోనా డెల్టా వేరియంట్ తగ్గుముఖం పడుతున్న తరుణంలో సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసింది. అంతేకాకుండా సెకండ్ వేవ్ లో ప్రజలను భయాందోళనకు గురిచేసిన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు అంచనా వేశారు. కానీ అనూహ్యంగా శరవేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతోంది.
అయితే ఒమిక్రాన్ వ్యాప్తిలో కీలక పాత్ర పోషించే మాస్కులపై యూఎస్ కు చెందిన ప్రముఖ ప్రజారోగ్య అధికారులు అధ్యయనం చేశారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తరువాత తగ్గుముఖం పట్టడంతో క్లాత్ మాస్కులను అనుమతించారు. అయితే ఇప్పుడు వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ వేగానికి క్లాత్, సర్జికల్ మాస్కులు తట్టుకోలేవని నిపుణులు అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. అయితే ఒమిక్రాన్ నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా డబుల్ క్లాత్, సర్జికల్ లు వాడాలని సూచించారు. ఎన్95 మాస్కులు మరింత ప్రతిభావంతంగా ఒమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కుంటాయని నిపుణులు వెల్లడించారు.