Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రష్యాను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాలతో పాటు మరికొన్ని దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో యుద్ధానికి అవసరమయ్యే ఆయుధాల విడిభాగాల్లో కూడా కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. చివరకు గృహాల్లో వాడుకునే ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ల నుంచి విడి భాగాలను తీసుకుని ఆయుధాలు, మిస్సైళ్లలో వాడుతున్నట్లు యూఎస్ వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో వెల్లడించారు. గతేడాది ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రారంభించింది. ఇప్పటికీ యుద్దం మొదలై 15 నెలలు గడుస్తోంది. అప్పటి నుంచి రష్యాపై పాశ్యాత్యదేశాలు ఆంక్షలు విధించాయి.
Read Also: K. Vasu: ఇండస్ట్రీలో విషాదం.. చిరంజీవి మొదటి సినిమా డైరెక్టర్ మృతి..
రష్యా ఇతర దేశాల నుంచి అక్రమ వ్యాపారాల ద్వారా చాలా వనరులను పొందుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. వాషింగ్ మిషన్లు, రిఫ్రిజ్ రేటర్లలో వాడే సెమీకండక్టర్లను మిస్సైళ్లలో వాడుతున్నట్లు యూనివర్శిటీ ఆఫ్ బ్రైటన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ లాలో సీనియర్ లెక్చరర్ అయిన డాక్టర్ లారెన్స్ హార్ తెలిపారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాకు అమెరికా నుంచి సాంకేతిక ఎగుమతులు 70 శాతం క్షీణించాయి. యూకే కూడా రష్యాకు సాంకేతిక బదిలీపై ఆంక్షలు అమలు చేస్తోంది. రష్యా ఆర్థిక వ్యవస్థపై రోజురోజుకు భారం పెరుగుతోందని హార్ అన్నారు.
రష్యా క్షీణిస్తున్న వనరులను భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నా కూడా ప్రస్తుత పరిస్థితి దీర్ఘకాలంలో నిలకడలేనిదిగా తయారవుతుందని అమెరికా ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. రష్యా నుంచి భారత్, చైనా, టర్కీకి క్రూడ్ ఆయిల్ ప్రవహిస్తోందని హార్ అన్నారు. భారత్ నుంచి రష్యా ఆయిల్ యూరప్ చేరుతుందని వ్యాఖ్యానించారు.