Canada Accident: రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రమాదాల్లో మరణాలు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్న వారిలో ప్రమాదాల మూలంగా మరణిస్తున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోందని ఈ మధ్య నిర్వహించిన సర్వేలో తేలింది. కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది మరణించారు. కెనడాలో వృద్ధులతో వెళ్తోన్న మినీ బస్సును ఓ భారీ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది చనిపోయారు. ఈ ఘటనలో 10 మంది వరకూ గాయపడినట్టు అధికారులు తెలిపారు. సెంట్రల్ కెనడాలోని మానిటోబా ప్రావిన్స్‌లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. విన్నిపెగ్‌కు పశ్చిమాన ఉన్న కార్బెర్రీ పట్టణం వద్ద ఈ రోడ్డు ప్రమాద జరిగినట్టు పోలీసులు తెలిపారు. తక్షణమే స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Read also: Samantha : ఆ సమయంలో దేవుడిని మనశ్శాంతిని ఇవ్వమని కోరుకున్నా…
ఒకటి మరియు ఐదో నెంబరు జాతీయ రహదారులు కలిసే కూడలిలో దాదాపు 25 మంది వృద్దులతో ప్రయాణిస్తున్న మినీ బస్సును ట్రక్కు ఢీకొట్టిందని మానిటోబా అధికారి రాబ్ హిల్ పేర్కొన్నారు. ప్రమాదంలో 15 మంది చనిపోయినట్టు ధ్రువీకరించారు. గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని తెలిపారు. ఈ ప్రాంతంలోని ఆసుపత్రులు పెద్ద సంఖ్యలో బాధితులకు ప్రతిస్పందిస్తున్నాయని మరియు అన్ని సౌకర్యాలు అందిస్తున్నట్టు అధికారులు ధృవీకరించారు. కార్బెర్రీకి ఉత్తరాన ట్రాన్స్-కెనడా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్న సమయంలో ఘటన జరిగిందని ఘటనా స్థలానికి సమీపంలోని రెస్టారెంట్‌లో పనిచేసే వ్యక్తి తెలిపారు. హైవే సమీపంలోని గుంటలో కాలిపోయిన వాహనాన్ని చూసినట్టు చెప్పారు. ఘటన జరిగిన ప్రదేశంలో అనేక అత్యవసర వాహనాలు, రెండు హెలికాప్టర్లు ఉన్నాయన్నారు. ఇటువంటి మంటలను తానెప్పుడూ చూడలేదని, చుట్టూ పొగలు వ్యాపించాయని అతడు చెప్పాడు.
Read also: Fiji Earthquake: ఫిజీలో భీకర భూకంపం.. రిక్టార్ స్కేలుపై 6.8గా నమోదు
ప్రమాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమకు ఇష్టమైన వారిని కోల్పోయిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్టు తన అధికారిక ట్విట్టర్ ఫీడ్‌లో తెలిపారు. బంధువులను కోల్పోయిన వారు అనుభవిస్తున్న బాధను తాను ఊహించగలనని.. కెనడియన్లు మీ కోసం ఉన్నారని భరోసా ఇచ్చారు.
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నట్టు ట్వీట్ చేశారు.