శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రణిల్ విక్రమసింఘే చేత ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకను విషమ పరిస్థితుల నుంచి బయటపడేసే బాధ్యత ప్రస్తుతం రణిల్ విక్రమసింఘేపై ఉంది. ఇటీవల శ్రీలంకలో నిరసనలు తీవ్రమై హింసాత్మకంగా మారాయి. దీంతో ప్రధాని పదవిలో ఉన్న మహిందా రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త ప్రధాని ఏర్పాటు అనివార్యమైంది.
బుధవారం దేశప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడిన అధ్యక్షుడు గోటబయ రాజపక్సే వారం రోజుల్లో ప్రధాని, కొత్త మంత్రి వర్గాన్నిఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో యునైటెడ్ నేషనల్ పార్టీ చీఫ్ గా ఉన్న రణిల్ విక్రమసింఘే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 73 ఏళ్ల రణిల్ విక్రమసింఘే 1993 నుంచి ఐదు సార్లు శ్రీలంకకు ప్రధానిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ అనుభవంతో శ్రీలంక ఆర్థిక పరిస్థితులను మార్చుతాడని ప్రజలు భావిస్తున్నారు. కొత్తగా ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న విక్రమసింఘేకు మాజీ ప్రధాని మహిందా రాజపక్సే శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదిలా ఉంటే ఈ రోజు శ్రీలంకలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతంతో అఖిల పక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు గోటబయ రాజపక్సే సూచించినా.. ఆ సమయంలో ప్రతి పక్ష నేత సజిత్ ప్రేమదాస పట్టించుకోలేదు. అయితే తాజాగా సజిత్ ప్రేమదాస కూడా తాను ప్రధాన మంత్రి పదవిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్ననంటూ అంతకుముందు అధ్యక్షుడు గోటబయ రాజపక్సేకు బహిరంగ లేఖ రాశారు. అధ్యక్షుడు తనను ముందుగా ఆహ్వానించిన క్రమంలోనే ఈ లేఖ రాసినట్టు ఆయన వెల్లడించారు. రాజ్యాంగంలోని 19వ అధికరణ తీసుకువస్తామని… అధ్యక్షుడికి క్రూరమైన అధికారాలు ఇచ్చే ఆర్టికల్ 20ని రద్దు చేయాలని ప్రేమదాస, అధ్యక్షుడు గోటబయ రాజపక్సేను డిమాండ్ చేశారు.