రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరణాల లెక్కలు ఊహకు అందడం లేదు. అంతేలేకుండా సాగుతున్న ఈ సమరంలో, ఇప్పటి వరకు దాదాపు 10వేలమంది రష్యన్ సైనికులు చనిపోయారని తాజాగా వెల్లడించింది రష్యన్ ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థ కొమ్సో. అయితే ఏమైందో ఏమోగాని వెంటనే ఆ కథనాన్ని తొలగించింది. అయితే, అప్పటికే ఆ వివరాలు ప్రపంచమంతా పాకిపోయాయి. రష్యా రక్షణ శాఖ గణాంకాలను కోట్ చేస్తూ, కొమ్సో మీడియా చెప్పిన దాని ప్రకారం, 9,861 మంది రష్యన్ సైనికులు చనిపోయారు. 16,153 మంది గాయపడ్డారు. రష్యా బలగాల మరణాలపై ఏ దేశానికా దేశం భిన్నమైన సంఖ్యలు చెబుతున్నాయి. మూడు వారాలకు పైగా సాగుతున్న ఈ భీకర యుద్ధంలో, రష్యా 15వేల మందికి పైగా సైనికుల్ని కోల్పోయిందని ఉక్రెయిన్ వెల్లడించింది. అదే అమెరికా లెక్కల ప్రకారమైతే మరణించిన రష్యా సైనికుల సంఖ్య 7 వేలు. అయితే, రష్యా మాత్రం, మార్చి 2 నాటికి 498 మంది సైనికులు మాత్రమే మరణించారని చెబుతోంది. ఆ తర్వాత నుంచి అధికారిక లెక్కలు బయటకు రాలేదు.
Read Also: YS Jagan: దిశ పెట్రోలింగ్ వెహికల్స్ ప్రారంభం.. ఫోన్ 5 సార్లు ఊపితే చాలు..!
అయితే మొదట దాదాపు పది వేల మంది రష్యా సోల్జర్స్ చనిపోయారని చెప్పిన వార్తా సంస్థ, ఆ కథనాన్ని తొలగించి, కొత్తగా కథనాన్ని ప్రచురించింది. ఇందులోఈ మరణాల వివరాలేవీ లేవు. రష్యా సాధిస్తోన్న పురోగతి గురించి మాత్రమే ప్రస్తావన ఉంది. రష్యాలో మీడియా సంస్థలను కంట్రోల్ చేస్తోంది పుతిన్ ప్రభుత్వం. తప్పుడు వార్తలు రాస్తే ఏకంగా జైలు పాలు చేసేందుకు ఆఘమేఘాల మీద చట్టం కూడా తెచ్చింది. రష్యన్ ప్రభుత్వమే కావాలనే మరణాలను దాస్తోందని పాశ్చాత్య మీడియా అంటోంది. దాదాపు 10వేలమంది రష్యన్ సైనికులు చనిపోయారని రష్యా అనుకూల వార్తా సంస్థ వెల్లడి. అయితే, పదివేల మంది రష్యన్ సైనికుల చనిపోయారన్నదే వాస్తవమైతే, అది పుతిన్ సేనకు కోలుకోలేని దెబ్బే. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ కలిపి 20 ఏళ్లలో అమెరికా కోల్పోయిన సైనికుల కంటే ఈ సంఖ్య ఎక్కువ. 1979లో ఆఫ్ఘనిస్తాన్ పై దురాక్రమణలో 15 వేలమంది సోవియట్ యూనియన్ సైనికులు చనిపోయారు. పదేళ్ల వ్యవధిలో సాగిన యుద్ధమది. అయితే, ఇప్పుడు ఉక్రెయిన్ యుద్దంలో కేవలం నెలరోజుల వ్యవధిలోనే పదివేలమంది సైనికులను రష్యా కోల్పోయింది. చిన్నదేశం ప్రతిఘటనలో ఈస్థాయిలో బలగాలను కోల్పోవడం రష్యా ప్రతిష్టకే అవమానం. అందుకే మీడియా కథనాన్ని వెంటనే తొలగించేలా, పుతిన్ సర్కారు ఒత్తడి చేసిందని నిపుణులు అంటున్నారు. యుద్ధం ముగిసేనాటికి, ఈ సంఖ్య ఇంకెంత పెరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.