Bangladesh: రిజర్వేషన్ల వివాదంతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. వేలాది మంది రోడ్లపైకి వచ్చిన హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల కోటా రిజర్వేషన్లను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ హింసలో ఇప్పటి వరకు 39 మంది ఆందోళనకారులు మరణించారు. గురువారం ఒక్క రోజు 19 మంది మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. 1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం మరణించిన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం కోటాతో వివాదం మొదలైంది. మరోవైపు ఇప్పటి వరకు ఉన్న ఈ పద్ధతిని మార్చి, ప్రతిభ ఆధారంగా ఉద్యోగం ఇవ్వాలని పలు యూనివర్సిటీల విద్యార్థులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Maruti Suzuki eVX: మార్కెట్లోకి మారుతి సుజూకీ తొలి ఎలక్ట్రిక్ కారు..! ఎప్పుడంటే..?
ఇదిలా ఉంటే శుక్రవారం నిరసనకారులు సెంట్రల్ బంగ్లాదేశ్‌లోని నార్సింగిలో జైలును ముట్టడించి, నిప్పంటించారు. ఈ సంఘటనలో జైలులో ఉన్న వందలాది ఖైదీలు పారిపోయారు. జైలుకు సమీపంలో నివసిస్తున్న స్థానికులు మాట్లాడుతూ.. పలువురు ఖైదీలు తమ సామన్లతో బయటకు రావడాన్ని చూసినట్లు చెప్పారు. జైలుకి నిప్పుపెట్టిన విషయాన్ని ప్రభుత్వ అధికారులు ఒప్పుకున్నారు. అయితే, ఎంత మంది ఖైదీలు పారిపోయారనే విషయం ప్రస్తుతానికి అధికారులు వెల్లడించలేదు.