Pakistan Economic Crisis: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది పొరుగు దేశం పాకిస్తాన్. ఐఎంఎఫ్ సాయం కోసం ఎదురుచూస్తోంది. 1.1 బిలియన్ డాలర్లను ఐఎంఎఫ్ ఇస్తేనే ప్రస్తుతం పాకిస్తాన్ బతికిబట్టకడుతుంది. అయితే ఐఎంఎఫ్ పెట్టిన షరతులు కఠినంగా ఉన్నా కూడా పాక్ సర్కార్ అంగీకరించాల్సి వస్తోందని సాక్షాత్తు పాక్ ప్రధాని షెహజాబ్ షరీఫ్ అన్నారు. ఈ షరతుల నేపథ్యంలో పాకిస్తాన్ ఇబ్బడిముబ్బడిగా పన్నులు పెంచుతోంది. ఇప్పటికే ధరలు పెరిగి కష్టాల్లో ఉన్న పాక్ ప్రజలు మరింత కష్టాల్లోకి నెట్టేయబడుతున్నారు.
Read Also: Naveen Case: నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. నిందితుడు కృష్ణ మిస్సింగ్?
ఇదిలా ఉంటే ప్రస్తుతం పాకిస్తాన్ తన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలిచ్చే పరిస్థితిలో లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం కారణంగా నగదు కొరతతో ఉన్న పాకిస్థాన్ ప్రభుత్వం జీతాలతో సహా బిల్లుల క్లియరింగ్‌ను నిలిపివేయాలని అకౌంటెంట్ జనరల్‌ను ఆదేశించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాలు అన్ని బిల్లుల క్లియరింగ్ ను నిలిపివేయాలని ఆర్థిక, రెవెన్యూ మంత్రిత్వశాఖ అకౌంటెంట్ జనరల్ ఆఫ్ పాకిస్తాన్ రెవిన్యూస్ ను ఆదేశించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే రక్షణ సంబంధిత సంస్థల జీతాలు, పెన్షన్లు వచ్చే నెలలకు సంబంధించించి ఇప్పటికే క్లియర్ చేయబడ్డాయి.
ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఫిబ్రవరి 20న అక్కడి పార్లమెంట్ మినీ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. కార్లు, గృహెపకరణాలు, చాక్లెట్లు, సౌందర్య సాధనాల దిగుమతిపై 17 నుంచి 25 శాతం అమ్మకపు పన్నును పెంచింది. సాధారణ విక్రయపన్నును 17 నుంచి 18 శాతానికి పెంచింది. విద్యుత్, పెట్రోలియం, గ్యాస్ ధరలు పెరగడం వల్ల అక్కడ ద్రవ్యోల్భణం మరింతగా తీవ్రం అవుతుందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. పాక్ ప్రభుత్వం గ్యాస్ ఛార్జీలను రూ. 147.57 నుంచి రూ. 295కు పెంచింది. అక్కడి ప్రజలు నిత్యావసరాల రేట్లు పెరగడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.