తాలిబన్లను ప్రపంచమంతా అరాచక శక్తిగానే చూస్తోంది. అఫ్ఘానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో అక్కడి మహిళలు బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు. అక్కడ పరిస్థితి అంత దారుణంగా పాకిస్థాన్‌లో మాత్రం తాలిబన్లను కీర్తిస్తున్నారు. తాలిబన్ల విపరీత చేష్టల్ని పొగుడుతూ బాలికలతో పాటలు పాడిస్తున్నారు పాకిస్థాన్ ఛాందసవాదులు. ఇస్లామాబాద్‌లోని మహిళల మదర్సాలో తాలిబన్లను పొగుడుతూ పాటలు పాడారు బాలికలు. జామియా హఫ్సాకు చెందిన లాల్ మసీద్ వద్ద తాలిబన్లకు మద్దతుగా సమావేశం జరిగింది. ఆ ప్రాంతంలో తాలిబన్ల జెండాలు కట్టారు. పాకిస్థాన్‌లో కూడా చాలా సార్లు చిన్నారుల్ని కిరాతకంగా చంపిన చరిత్ర తాలిబన్లది. అయినా, అక్కడ పిల్లలతో బలవంతంగా సలాం తాలిబన్స్ పాట పాడించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తాలిబన్లకు మద్దతుగా సమావేశం గురించి సమాచారం అందిన వెంటనే స్పందించారు స్థానిక అధికారులు. హుటాహుటిన జామియా మసీదు వద్ద గల తాలిబన్ల జెండాలను తొలగించారు.