Bangladesh Violence: భారత వ్యతిరేకి, బంగ్లాదేశ్ రాడికల్ విద్యార్థి సంఘం ఇంక్విలాబ్ మంచో ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హాది హత్యతో ఒక్కసారిగా ఆ దేశంలో హింస చోటుచేసుకుంది. ముఖ్యంగా, రాడికల్ శక్తులు హిందువులను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే, మైమన్‌సింగ్ జిల్లాలో ఒక హిందూ వ్యక్తిని ‘‘దైవ దూషణ’’ చేశాడనే ఆరోపణలో కొట్టి చంపడం సంచలనంగా మారింది. బాధితుడిని 30 ఏళ్ల దీపు చంద్ర దాస్‌గా గుర్తించారు. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అతడిపై దాడి జరిగింది.
Read Also: U-19 Asia Cup Semi-Finals: వర్షం అడ్డంకి.. అండర్-19 ఆసియా కప్ సెమీ ఫైనల్స్ ఆలస్యం
అయితే, ఈ హింసపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ స్పందించారు. “మైమెన్సింగ్‌లో ఒక హిందూ వ్యక్తిని కొట్టి చంపిన సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. న్యూ బంగ్లాదేశ్‌లో ఈ రకమైన హింసకు చోటు లేదు. ఈ క్రూరమైన నేరంలో పాల్గొన్న ఎవరినీ వదలబోము” అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని తీవ్రవాద గ్రూపులు నిర్వహిస్తున్న హింస పట్ల అప్రమత్తంగా ఉండాలని తాత్కిలిక ప్రభుత్వం ప్రజలను కోరింది. హింస, భయం, దహనం, విధ్వంసం వంటి చర్యలను ఖండిస్తున్నట్లు పేర్కొంది. బంగ్లాదేశ్ కీలకమైన సమయంలో చారిత్రాత్మక ప్రజాస్వామ్య పరివర్తన గుండా వెళ్తోందని, గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నాలను సృష్టించి దేశం అశాంతి వైపు ప్రయణించడాన్ని అనుమతించబోమని హెచ్చరించారు.
షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కీలక పాత్ర పోషించిన, భారత వ్యతిరేకిగా పేరుగాంచిన విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదిని కొన్ని రోజుల క్రితం ఢాకాలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి వెళ్లారు. ఆయన తీవ్ర గాయాలపాలై చికిత్స తీసుకుంటూ మరణించాడు. మరోవైపు, రాడికల్ శక్తులు బంగ్లాలోని మీడియా సంస్థలైన ది డైలీ స్టార్, ప్రొథోమ్ అలోలపై దాడులు జరిగాయి. ఈ సమయంలో ప్రభుత్వం మాట్లాడుతూ.. తాము జర్నలిస్టులతో ఉన్నామని, ఉగ్రవాదం, హింసకు తీవ్రంగా క్షమాపణలు చెబుతున్నామని పేర్కొంది.