Monkeypox cases in world: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రత ఇంకా తగ్గుముఖం పట్టకముందే.. మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. బ్రిటన్ లో ప్రారంభం అయిన ఈ కేసులు నెమ్మదిగా యూరప్ లోని అన్ని దేశాలకు వ్యాపించాయి. ఇక అమెరికాలో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) మంకీపాక్స్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఇక భారత్ లో కూడా మొత్తం 4 కేసులు నమోదు అయ్యాయి.
ప్రపంచంలో ఇప్పటి వరకు 78 దేశాల్లో 18,000 మంకీపాక్స్ కేసులు నమోదు అయినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. మంకీపాక్స్ తీవ్రత యూరోపియన్ దేశాలు, అమెరికాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయెసస్ వెల్లడించారు. ఈ రెండు ప్రాంతాల్లోనే 95 శాతం కేసులు వెలుగులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో యూరప్ లో 70 శాతం కేసులు ఉంటే..అమెరికాలో 25 శాతం కేసులు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 98 శాతం స్వలింగసంపర్కం కలిగిన పురుషుల్లోనే ఈ వ్యాధి కనుగొబడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, బెల్జియం, ఇజ్రాయిల్, ఆస్ట్రేలియా, ఇండియా, యూఏఈ మొదలైన దేశాాల్లో మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి.
Read Also: Russia: 2028లో రష్యా కొత్త స్పేస్ స్టేషన్.. అప్పటి వరకు నాసాతోనే..
ఇదిలా ఉంటే మంకీపాక్స్ కు అడ్డుకట్ట వేసేందుకు పలు దేశాలు మశూచి వ్యాక్సిన్ ను ఉపయోగిస్తున్నాయి. ఇప్పటికే కెనడా, అమెరికా, యూఎస్ఏ ఎంవీఏ-బీఎన్(మాడిఫైడ్ వ్యాక్సినియా అంకారా – బవేరియన్ నోర్డిక్) అనే వ్యాక్సిన్ ను మంకీపాక్స్ వ్యాధి నివారణ కోసం ఉపయోగించనున్నారు. మరో రెండు వ్యాక్సిన్లను కూడా త్వరలో రాచ్చని తెలుస్తోంది. అయితే టీకాల ప్రభావం, డోసులపై డేటా లేకపోవడం వల్ల ప్రస్తుతానికి ప్రజలకు సామూహికంగా మంకీపాక్స్ టీకాలను సిఫారసు చేయలేదు.