ఫ్రెంచ్ సెనేట్‌లో ‘యాంబిషన్ ఇండియా-2021’ బిజినెస్ ఫోరంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గత ఏడేళ్లలో తెలంగాణలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ఆయన ప్రస్తావించారు. ఈ ప్రసంగంలో టీఎస్ ఐపాస్ గురించి కూడా కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రమని, తెలంగాణ ప్రభుత్వ టీఎస్ ఐపాస్ పాలసీ పారదర్శకతతో కూడిన స్వీయ ధృవీకరణను అనుమతిస్తుందని కేటీఆర్ చెప్పారు. చట్టం ప్రకారం 15 రోజులలో అన్ని రకాల అనుమతులకు సంబంధించి పూర్తి క్లియరెన్స్ లభిస్తుందన్నారు.
Read Also: ‘మంగళవారం మరదలు’ వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్‌రెడ్డి వివరణ
ఒకవేళ 15 రోజుల వ్యవధిలో పరిశ్రమలకు అనుమతులు రాకపోతే 16వ రోజున పూర్తి అనుమతులు లభించి ఆమోదించబడినట్లు పరిగణించబడుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు TSIICలో దాదాపు 200 వేల ఎకరాల పారిశ్రామిక భూమి అందుబాటులో ఉందని కేటీఆర్ చెప్పారు. విద్యుత్, నీటి వసతితోపాటు ఉత్తమ మౌలిక సదుపాయాలున్నట్లు చెప్పారు. ఇక తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్‌ను కేటీఆర్ హైలైట్ చేశారు. ప్రభుత్వం తన సొంత ఖర్చులతో అవసరమైన వారికి శిక్షణనిస్తుందని, వారిని నాణ్యమైన మానవ వనరులుగా తీర్చిదిద్దుతుందని ఆయన పేర్కొన్నారు.