Middle East: మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆ ప్రాంతంలోని అన్ని దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఇటీవల సిరియాలోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ వైమానిక దాడుల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఇజ్రాయిల్ దాడిలో ఇరానియన్ మిలిటరీ, ఖుద్స్ ఫోర్స్ టాప్ జనరల్‌తో పాటు మరో ఆరుగురు ఇరాన్ సైనిక అధికారులు మరణించారు. ఈ దాడి తర్వాత ఇజ్రాయిల్ తప్పకుండా ప్రతికారాన్ని ఎదుర్కొంటుందని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ బుధవారం మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ తప్పక శిక్షించబడాలి అని అన్నారు. అయితే, ఏప్రిల్ 1న సిరియా డమాస్కస్ దాడికి ఇజ్రాయిల్ బాధ్యత వహించలేదు.
Read Also: China: ప్రధాని మోడీ “సరిహద్దు” వ్యాఖ్యలపై స్పందించిన చైనా..
రంజాన్ తర్వాత ఎప్పుడైనా ఇరాన్, ఇజ్రాయిల్‌పై దాడికి తెగబడొచ్చనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు తమ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నాయి. తాజాగా ఏప్రిల్ 13 వరకు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కి వెళ్లే లుప్తాన్సా ఎయిర్‌లైన్స్ విమానాలను నిలిపేస్తున్నట్లు ఆ సంస్థ గురువారం తెలిపింది. ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి టెహ్రాన్‌కి విమానాలను నడపకూడదని నిర్ణయించుకుంది.
రష్యా తన పౌరుల్ని మిడిల్ ఈస్ట్, ముఖ్యంగా ఇజ్రాయిల్, లెబనాన్, పాలస్తీనా భూభాగాలకు వెళ్లొద్దని కోరింది. ఈ ప్రాంతంలోని అన్ని దేశాలు సంయమనం పాటించాలని రష్యా కోరింది. మరోవైపు ఇరాన్ దాడి చేస్తుందనే వార్తల నేపథ్యంలో ఇజ్రాయిల్ పూర్తిగా అప్రమత్తమైంది. దక్షిణ గాజాలోని ఇజ్రాయిల్ దళాలను వెనక్కి రప్పించింది. ఇజ్రాయిల్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బంకర్లను సిద్ధం చేస్తోంది. మరోవైపు జీపీఎస్ నావిగేషన్‌పై నియంత్రణ విధిస్తోంది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడుతూ.. మేము రక్షణ, దాడి రెండింటిలోనూ సంసిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.