China: ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చైనా-ఇండియా సరిహద్దు సమస్యలపై మాట్లాడారు. సరిహద్దుల్లో ఉన్న సుదీర్ఘమైన పరిస్థితిని పరిష్కరించాలని చెప్పారు. సరిహద్దు వివాదాల కారణంగా ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను సాధారణీకరించడంపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ కంట్రీ చైనా గురువారం స్పందించింది.
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి వ్యాఖ్యలను చైనా గుర్తించిందని అన్నారు. సుస్థిరమైన చైనా-భారత్ సంబంధాలు ఇరు పక్షాల ఉమ్మడి ప్రయోజనాలకు ఉపయోగపడుతాయని, ఈ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి అనుకూలంగా ఉంటాయని మేము విశ్వసిస్తున్నామని ఆమె అన్నారు. 2020 గాల్వాన్ ఘర్షణ తర్వాత భారత్, చైనాల మధ్య సరిహద్దు సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతంలో ఇరు దేశాలు కూడా భారీగా సైనిక సిబ్బందిని మోహరించింది. సైనిక దళాల ఉపసంహరణ కోసం ఇరు దేశాలు దౌత్య, సైనిక స్థాయి చర్చలు జరిపాయి.
విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. సరిహద్దు సమస్య, భారత్-చైనా సంబంధాల సంపూర్ణతను సూచించదని, దీనిని ద్వైపాక్షిక సంబంధాల్లో సరైన విధంగా నిర్వహించాలని అన్నారు. న్యూఢిల్లీ, బీజింగ్ దౌత్య, సైనిక మార్గాల ద్వారా సన్నిహిత సంభాషణలు కొనసాగుతున్నాయన్నారు. దీర్ఘకాలిక దృక్ఫథంతో ఇరు దేశాలు ద్వైపాక్షి సంబంధాలను నిర్వహిస్తున్నాయని, పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని, సహకారానికి కట్టుబడి ఉండాలని, విభేదాలను సక్రమంగా నిర్వహించాలని, ద్వైపాక్షిక సంబంధాలను సుస్థిరంగా ఉండేందుకు ఇండియా ఆ దిశగా పనిచేస్తుందని మేము ఆశిస్తున్నామని ఆమె అన్నారు.