Maldives: మాల్దీవులకు విషయం బోధపడినట్లుంది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆ దేశం, చైనా అండ చూసుకుని భారత వ్యతిరేక ధోరణిని ప్రదర్శించింది. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ ముయిజ్జూ ‘ఇండియా ఔట్’ నినాదంతో అధికారంలోకి వచ్చాడు. ప్రెసిడెంట్‌గా ఎన్నిక కావడంతోనే మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులను వెళ్లిపోవాలని ఆదేశించాడు. ఇదే కాకుండా చైనాతో సైనిక ఒప్పందాన్ని చేసుకున్నాడు. మే 10 నాటికి తమదేశంలోని ఉన్న ప్రతీ భారతీయ సైనికుడు వెళ్లిపోవాలని డిమాండ్ చేశాడు.
ఇదిలా ఉంటే ముయిజ్జూ స్వరంలో మార్పు కనిపిస్తోంది. ఇన్నాళ్లు భారత్ అంటేనే ఎగిరెగిరి పడిన అతను, ఇప్పుడు భారత అనుకూల వ్యాఖ్యలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. రుణాల ఉబిలో చిక్కుకున్న ఈ ద్వీప దేశం.. రుణ విముక్తి కోసం భారత్ తమ దేశానికి ‘‘సన్నిహిత మిత్రదేశం’’గా కొనసాగుతుందని ముయిజ్జూ వ్యాఖ్యానించాడు. గతేడాది చివరినాటికి మాల్దీవులు భారత్‌కి దాదాపు 400.9 మిలియన్ డాలర్లు బకాయి పడింది.
Read Also: Harish Rao : బీజేపీకి బీ టీమ్ లీడర్‌గా రేవంత్ రెడ్డి తీరు
గురువారం, అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. మాల్దీవులకు సాయం చేయడానికి భారత్ కీలక పాత్ర పోషిస్తుందని, భారత్ అత్యధిక సంఖ్యలో ప్రాజెక్టులను అమలు చేసిందని ముయిజ్జూ అన్నారు. భారతదేశం సన్నిహిత మిత్రదేశంగా కొనసాగుతుందని, దానిలో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. ప్రణాళిక ప్రకారం ఈ నెలలో భారత సైనిక సిబ్బంది మొదటి బ్యాచ్ మాల్దీవులను వదిలి వెళ్లిన తర్వాత భారతదేశాన్ని ప్రశంసిస్తూ ఈ వ్యాఖ్యలు వచ్చాయి. మే 10 నాటికి మూడు విమానయాన ప్లాట్‌ఫారమ్స్ నిర్వహిస్తున్న మొత్తం 88 మంది సైనిక సిబ్బంది దేశం వదిలి వెళ్లాలని ముయిజ్జూ కోరాడు. వీటితో భారత్ అక్కడి ప్రజలకు మానవతా సాయం అందిస్తోంది.
ప్రభుత్వాలు తీసుకున్న భారీ రుణాలను తిరిగి చెల్లించడంలో మాల్దీవులకు రుణ ఉపశమన చర్యలను కల్పించాలని ప్రస్తుత ప్రెసిడెంట్ భారత్‌ని కోరారు. భారత్ నుంచి తీసుకున్న రుణాల చెల్లింపు నిర్మాణంలో మినహాయింపులను అన్వేషించడానికి చర్చలు జరుపుతున్నట్లు ముయిజ్జూ వెల్లడించారు. కొనసాగుతున్న ప్రాజెక్టులు నిలిపివేయడానికి బదులుగా, వాటిని వేగవంతం చేయడానికి ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు కనిపించలేదని చెప్పాడు.
మాల్దీవుల్లో ఏప్రిల్ నెలలో పార్లమెంట్ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో భారత్ పట్ల సామరస్యపూర్వక వ్యాఖ్యలు చేశారు. రుణాల చెల్లింపులో ఉపశమన చర్యలను భారత్ సులభతరం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గత మాల్దీవుల పాలకుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంక్) నుండి 1.4 మిలియన్ డాలర్లను రుణంగా తీసుకున్నారు. ఇదిలా ఉంటే, భారతదేశంతో సంబంధాలు బలహీనపడిన తర్వాత ముయిజ్జూ జనవరి నెలలో బీజింగ్ పర్యటనకు వెళ్లారు. చైనా-మాల్దీవుల మధ్య 20 ఒప్పందాలు కుదిరాయి. చైనా పర్యటకులను పంపుతామని చెప్పడంతో పాటు, 130 మిలియన్ డాలర్ల గ్రాంట్‌ని కూడా ప్రకటించింది.