Ring of Fire: రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పం తూర్పు తీరానికి సమీపంలో శనివారం తెల్లవారుజామున 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇటీవల, రష్యాలో తరుచుగా భూకంపాలు, భూ ప్రకంపనాలు వస్తున్నాయి. శనివారం భూకంపం కారణంగా అధికారులు ‘‘సునామీ’’ హెచ్చరికలు చేశారు. సముద్ర గర్భంలో దాదాపుగా 10-20 కి.మీ లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
భూమిపై ఎక్కువగా భూకంపాలు సంభవించే ప్రాంతమైన ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’ ఇటీవల కాలంలో చాలా యాక్టివ్‌గా మారినట్లు కనిపిస్తోంది. ఈ రీజియన్‌లో భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలు సాధారణం. పసిఫిక్ మహా సముద్రం చుట్టూ ఉండే ఈ విశాలమైన రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతం చిలీ, పెరు, మెక్సికో, అమెరికా, కెనడా, రష్యా, జపాన్ , తైవాన్, ఇండోనేషియా, పాలినేషియా ప్రాంతాల్లో విస్తరించి ఉంది.
Read Also: Medak : మా బతుకులను ఆగం చేసి పోయింది.. మెదక్‌లో విలపిస్తున్న మమత తల్లిదండ్రులు
ఈ ప్రాంతంలో ఏర్పడిన భూకంపాలు భారీ సునామీలకు కారణమయ్యాయి. తాజాగా, రష్యాలోని కమ్చట్కా ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. గతంలో భారీ సునామీలకు ఈ ప్రాంతం ప్రభావితమైంది. జూలై 2025లో, 1952లో భారీ సునామీలు వచ్చాయి. కమ్చట్కా ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్స్ క్రియాశీలత ఎక్కువగా ఉంది. దీంతో, ప్లేట్ల మధ్య ఘర్షణ ద్వారా ఉద్భవించే అపారమైన శక్తి భూకంపాలకు కారణమవుతోంది.
భారీ పసిఫిక్ ప్లేట్ సబ్ డక్షన్ అనే ప్రక్రియలో చిన్న ఓఖోట్స్క్ మైక్రోప్లేట్ కిందకు జారిపోతోంది. దీంతో రెండు పేట్ల మధ్య ఘర్షణ భూకంపాలకు కారణమవుతోంది. ఈ ప్లేట్లు ఏడాదికి 86 మిల్లీమీటర్ల వేగంతో కలుస్తాయి. ఇది భూ గ్రహంపై అత్యంత వేగంగా కదిలే సబ్ డక్షన్ జోన్‌లలో ఒకటిగా మారుతోంది. కాల క్రమేణా, ఇది మెగా థ్రస్ట్ ఫాల్ట్ భారీ ఒత్తిడిన కలిగించి, ఒక్కసారిగా విడిపోతే శక్తివంతమైన భూకంపాలు వస్తాయి.
కమ్చట్కా ప్రాంతంలో భూమి లోతుల్లో ఉన్న మాంటిల్ పదార్థం పైకి రావడం వల్ల, ఈ ప్రాంతంలోని వందలాది అగ్నిపర్వతాలకు ఇంధనం లభించినట్లు అవుతోంది. ఈ ప్రాంతాన్ని భూగర్భ పరిశోధకులు ఒక ‘‘లైవ్ లాబోరేటరీ’’గా అభివర్ణిస్తారు. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ కారణంగానే ఇండోనేషియా ప్రాంతంలో తరుచుగా భూకంపాలు రావడం, అగ్ని పర్వతాలు బద్ధలవ్వడం జరుగుతోంది.