Gaza War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య పోరాటం భీకరం సాగుతోంది. అక్టోబర్ 7 నాటి దాడి తర్వాత హమాస్‌కి కేంద్రంగా ఉన్న పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) విరుచుకుపడుతోంది. తాజాగా హమాస్ కమాండ్ సెంటర్‌గా పనిచేస్తున్న అల్-షిఫా ఆస్పత్రిడిపై ఇజ్రాయిల్ బలగాలు దాడి చేశాయి. ఈ దాడిలో 20 మంది హమాస్ ఉగ్రవాదులు హతమయ్యారు. చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Taranjit Singh: బీజేపీలోకి భారీగా వలసలు.. తాజాగా తరన్‌జిత్ సింగ్ చేరిక
ఆపరేషన్ సమయంలో 200 మంది అనుమానిత ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసినట్లు ఇజ్రాయిల్ సైనిక ప్రతినిధి డేనియల్ హగారి తెలిపారు. చనిపోయిన వారిలో కీలక హమాస్ ఉగ్రవాది ఫయాక్ అల్-మభౌహ్ ఉన్నాడు. హమాస్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్‌కి ఇతరు చీఫ్‌గా పనిచేస్తున్నాడు. గాజాలోని ఆస్పత్రులు, ముఖ్యంగా అల్-షిఫా ఆస్పత్రి హమాస్ కమాండ్ సెంటర్‌గా పనిచేస్తోందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది.
అక్టోబర్ 7న గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేశారు. ఈ దాడిలో 1200 మంది మరణించగా.. 240 మందిని కిడ్నాప్ చేసి గాజాలోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలపై విరుచుకుపడుతోంది. మరోవైపు హమాస్ చర్యల మూలంగా పాలస్తీనాలోని సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. యుద్ధం కారణంగా మరణించిన వారి సంఖ్య 30 వేలను దాటింది. మరోవైపు పాలస్తీనా ప్రజలు తీవ్ర ఆకలిని ఎదుర్కొంటున్నారు.