Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ సంధి తర్వాత గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిలీ ఆర్మీ విరుచుకుపడుతోంది. ఇన్నాళ్లు ఉత్తర గాజాకే పరిమితమైన యుద్ధా్న్ని, దక్షిణంలోని సురక్షిత ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. హమాస్ ఉగ్రసంస్థను లేకుండా చేసేందుకు ఇజ్రాయిల్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ.. ఆ దేశ స్పై ఏజెన్సీ మొసాద్‌కి హమాస్ కీలక నేతలను హతం చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
ఇదిలా ఉంటే గాజాలో హమాస్ ఉగ్రవాదుల పటిష్ట స్థితికి కారణమవుతున్న టన్నెల్ వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చేందుకు ఇజ్రాయిల్ సిద్ధమవుతోంది. టన్నెల్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసేందుకు పెద్ద ఎత్తున పంపులు, మోటార్ల సాయంతో సొరంగాల్లో వరదలు సృష్టించాలని భావిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. సొరంగాల్లో దాక్కున్న హమాస్ ఉగ్రవాదుల్ని బయటకు రప్పించేందుకు ఇలా చేయనుంది.
Read Also: Shark Attack: పెళ్లైన తర్వాత రోజే షార్క్ దాడిలో నవ వధువు మృతి
ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) కూడా ఇలాంటి ప్రణాళిక ఉన్నట్లు చెబుతోంది. దీని కోసం ఇంజనీరింగ్ చర్యల్ని ప్రారంభించింది. ఐడీఎఫ్ సైనిక, సాంకేతిక సాధనాలను ఉపయోగించి వివిధ మార్గాల్లోని హమాస్ టన్నెల్స్‌ని కూల్చివేసేందుకు పనిచేస్తోంది. హమాస్ భూగర్భ సొరంగాలు ఉగ్రవాదుల దాడులు చేసిన తర్వాత తమను తాము రక్షించుకునేందుకు సాయపడుతోంది. గాజాలోని పలు కీలక ఆస్పత్రుల కింద కూడా హమాస్ సొరంగాలు బయటపడ్డాయి.
అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడిలో ఇజ్రాయిల్‌లొో 1200 మంది మరణించారు. 240 మంది బందీలుగా పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్, గాజా ప్రాంతంపై విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో దాదాపుగా 16 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇందులో చాలా మంది పిల్లలు ఉండటంపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇటీవల ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి కుదిరింది. ఈ సంధిలో భాగంగా ఇజ్రాయిల్ తన జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేయగా.. హమాస్ ఇజ్రాయిల్ బందీలను విడుదల చేసింది.