Iran: ఇరాన్‌లో సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఆర్థిక సంక్షోభంపై మొదలైన నిరసనలు, దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలుగా మారాయి. అయితే, ఈ ప్రజల తిరుగుబాటుకు అమెరికా, ఇజ్రాయిల్ మద్దతు తెలుపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకడుగు ముందుకేసి ఇరాన్‌ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ‘‘ ఇరాన్ శాంతియుత నిరసనకారుల్ని కాల్చి చంపితే, అమెరికా జోక్యం చేసుకుంటుంది. మేము ఫుల్లీ లోడెడ్, లాక్డ్, రెడీ టూ గో స్థితిలో ఉన్నాము’’ అని ఇరాన్‌పై దాడి చేస్తామని హెచ్చరించారు.
అయితే, ఈ హెచ్చరికల్ని ఇరాన్ లైట్ తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి గాజా వరకు అమెరికా ‘‘రక్షణ ఆపరేషన్ల’’ గురించి ఇరానియన్లకు బాగా తెలుసు అని ఖమేనీ సలహాదారు అలీ షంఖానీ అన్నారు. ఆప్ఘాన్, ఇరాక్ నుంచి అమెరికా వెనక్కి వెళ్లిన ఘటనల గురించి ఆయన గుర్తు చేశారు. 2021లో ఆఫ్ఘాన్ నుంచి 20 ఏళ్ల తర్వాత అమెరికా వదిలేసి వెళ్లింది. ఒక మిలియన్ ఆయుధాలు, సైనిక సామాగ్రిని తాలిబన్లకు వదిలేసి వెళ్లారు. ఈ నిష్క్రమణల గురించి షంఖానీ ప్రస్తావించారు. ఇరాక్ నుంచి అమెరికా ఉపసంహరణ అనంతరం ఐసిస్ ఉద్భవించి, 2013–2017 మధ్య దేశం తీవ్రమైన హింస చెలరేగిందని చెప్పారు.
అమెరికన్లు వారి సైన్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని షంఖానీ హెచ్చరించారు. ఇరాన్ భద్రతను లక్ష్యంగా చేసుకుని జోక్యం చేసుకుంటే విచారకరమైన ప్రతిస్పందన ఎదుర్కొంటారని ఆయన అన్నారు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి గాజా వరకు అమెరికా రక్షణ రికార్డులు ఇరానియన్లకు బాగా తెలుసని ఎద్దేవా చేశారు. ఇరాన్ జాతీయ భద్రత అనే రెడ్ లైన్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీనిని టచ్ చేస్తే సాహసం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.