Israel-Hamas War: అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ వైమానికదళం గాజా స్ట్రిప్‌పై నిప్పుల వర్షం కురిపిస్తోంది. హమాస్ ఉగ్ర స్థావరాలతో పాటు ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం ఉన్న అన్ని ప్రాంతాలు, బిల్డింగులపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్, పాలస్తీనాలోని గాజాపై భూతల దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాజా ఉత్తర ప్రాంతంలోని పాలస్తీయన్లు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించింది ఇజ్రాయిల్ ఆర్మీ.
ఇదిలా ఉంటే హమాస్ ఇజ్రాయిల్ ప్రజలతో పాటు పలువురు విదేశీయులను మొత్తంగా 199 మందిని బందీలుగా పట్టుకుంది. ప్రస్తుతం వీరిని విడిపించేందుకు ఇజ్రాయిల్ రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ సిద్ధంగా ఉందని, అయితే ముందుగా ఇజ్రాయల్ గాజాపై మైమానిక దాడుల్ని ఆపాలని ఇరాన్ పేర్కొంది. గాజాపై ఇజ్రాయిల్ దాడుల్ని ఆపేస్తే బందీలందరిని విడిచిపెట్టేందుకు హమాస్ సిద్ధంగా ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నాసర్ కనానీ టెహ్రాన్ లో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Mansion 24: దెయ్యాలు ఉన్నాయంటే నమ్మను కానీ ‘మాన్షన్ 24’ చూస్తే భయమేసింది: సత్యరాజ్
హమాస్ అధికారులు బందీలుగా చేసుకున్న పౌరులను విడుదల చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే అంతకుముందు గాజాపై దాడులను నిలిపేయాలని కనాసి అన్నారు. అయితే హమాస్ దాడి వెనక ఇరాన్ ఉందనే ఆరోపనలు వినిపిస్తున్నాయి. గాజాపై భూతల దాడులకు ఇజ్రాయిల్ ప్రయత్నిస్తే, పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే ఇరాన్ హెచ్చరించింది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ వైపు 1400 మంది మరణిస్తే, గాజా ప్రాంతంలో 2000 కన్నా ఎక్కువ ప్రజలు మరణించారు.