Indian Embassy Shares 5 Options For Border Crossing To Leave Ukraine Amid War: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రం అవుతోంది. క్రిమియాలో కేర్చ్ వంతెన కూల్చేసిన తర్వాత రష్యా దాడులను తీవ్రం చేసింది. వరసగా కామికేజ్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా ఉక్రెయిన్ పై దాడులు చేస్తోంది రష్యా. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు వెంటనే ఉక్రెయిన్ విడిచిపెట్టాలని బుధవారం సూచించింది భారత విదేశీ మంత్రిత్వశాఖ. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ విడిచిపెట్టేందుకు ఐదు మార్గాలను సూచించింది. యుద్ధం నేపథ్యంలో భారతీయుల రక్షణ నేపథ్యంలో ఉక్రెయిన్ లోని భారత ఎంబసీ కొన్ని సూచనలు చేసింది. యుద్ధ ప్రాంతాలకు ప్రయాణించకుండా హెచ్చరించింది. భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దులు దాటడానికి అందుబాటులో ఉన్న మార్గాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు.
Read Also: Andhra Pradesh: మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
ఉక్రెయిన్-హంగేరీ, ఉక్రెయిన్-స్లోవేకియా సరిహద్దు, ఉక్రెయిన్-మాల్డోవా, ఉక్రెయిన్-పోలాండ్, ఉక్రెయిన్-రొమేనియా సరిహద్దులను దాటి ఉక్రెయిన్ దేశాన్ని వీడాలని సూచించింది. సరిహద్దులు దాటేటప్పుడు భారతీయులు తప్పకుండా భారత పాస్ పోర్టు, ఉక్రెయిన్ రెసిడెంట్ పర్మిట్, స్టూడెంట్ కార్డ్, విమాన టికెట్ కలిగి ఉండాలని సూచించింది. ఉక్రెయిన్- హంగేరి సరిహద్దు వద్ద జకర్పతియా ప్రాంతంలో చెక్ పోస్టులు ఉన్నాయని ఎంబసీ తెలిపింది. సరిహద్దు దాటే ముందు ఆయా దేశాల ఎంబసీలను సంప్రదించాలని సూచించింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైన తర్వాత ‘ ఆపరేషన్ గంగా’ పేరుతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను ఎయిర్ లిప్ట్ చేసింది భారతప్రభుత్వం. రొమేనియా, పోలాండ్, స్లోవేకియా, మాల్డోవా దేశాల మీదుగా వారిని సురక్షితంగా ఇండియాకు చేర్చారు.
ఇదిలా ఉంటే రష్యా, ఉక్రెయిన్ దేశంపై విరుచుకుపడుతోంది. ప్రధాన నగరాలపై రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి ప్రజలు వలస వెళ్లేలా చేస్తోంది రష్యా. ఇప్పటికే కరెంట్ లేక ఉక్రెయిన్ నగరాలు అంధకారంలో ఉన్నాయి. రానున్న మరికొన్ని రోజల్లో దేశవ్యాప్తంగా తీవ్రమైన విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఏర్పడింది. దాదాపుగా 30 శాతం విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. శీతాకాలంలో కరెంట్ లేకపోతే ఇళ్లను వెచ్చపరుచుకునే వ్యవస్థ దెబ్బతింటుంది. దీని వల్ల ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లే ఆవశ్యకత ఏర్పడుతుందనేది రష్యా ప్లాన్ గా తేలుస్తోంది.