India-Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేఎల్ఎఫ్) ఉగ్రసంస్థ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియా మధ్య తీవ్ర దౌత్యవివాదం ఏర్పడింది. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో వివాదం చెలరేగింది. ఇంతే కాకుండా, భారత సీనియర్ రాయబారిని కెనడా నుంచి బహిష్కరించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. భారత్ కూడా అంతే ధీటుగా కెనడా రాయబారి దేశం నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది.
Read Also: Karachi Fire Accident: షాపింగ్ మాల్‌లో అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి!
ఇదిలా ఉంటే నిజ్జర్ హత్యపై భారత హైకమిషర్ సంజయ్ కుమార్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు లేకుండా ఇండియాపై ఆరోపణలు చేయడాన్ని తప్పుపట్టారు. హత్యకు సంబంధించి కెనడా తన ఆరోపణలకు సాక్ష్యాలు విడుదల చేయాలని కోరారు. సీటీవీ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం గురించి ప్రశ్నించిన సమయంలో సంజయ్ కుమార్ వర్మ కీలక కామెంట్స్ చేశారు. ‘‘దర్యాప్తు పూర్తి కాకుండా భారతదేశాన్ని దోషిగా నిర్థారించడం, ఇది చట్టబద్ధమైన నియమమా..?’’అని ప్రశ్నించారు. భారత దేశాన్ని ఎలా దోషిగా నిర్థారించారని అని అడిగారు. ‘‘ఇండియాను ఈ కేసులో సహకరించాలని కెనడా కోరింది.. దీన్ని క్రిమినల్ పదజాలంలో చెబితే.. మీరు ఇప్పటికే దోషిగా తేలారు, మాకు సహకరించాలి అని అర్థం’’ అని ఆయన అన్నారు.
ఈ ఏడాది జూన్ నెలలో కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో గురుద్వారా ముందు హర్దీప్ సింగ్ నిజ్జర్‌ని గుర్తుతెలియని వ్యక్తుల హత్య చేశారు. అయితే ఈ హత్యలో భారత ప్రమేయం ఉందని కెనడా ఆరోపించింది. దీన్ని ఇండియా తప్పుపట్టింది. కెనడా అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తోందని, కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సమానత్వం కోసం 41 మంది దౌత్యవేత్తలను కెనడా ఉపసంహరించుకోవాలని భారత్ కోరింది.