Flour rate in Pakistan: సంక్షోభం దిశగా వెళ్తోంది పాకిస్తాన్. దివాళా అంచుకు చేరుకుంటోంది. ఇప్పటికే ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఉద్యోగుల జీతాల్లో కూడా కోత పెట్టింది. అనవసర ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉంటే అక్కడ నానాటికి నిత్యావసరాల ధరలు నానాటికి పెరుగుతున్నాయి. ఎంతలా అంటే రాబోయే రోజుల్లో తిండి కోసం ప్రజలు మధ్య గొడవలు తలెత్తే విధంగా పరిస్థితులు ఉన్నాయి. మరో శ్రీలంకను తలపించేలా.. అన్నింటి రేట్లు పెరుగుతున్నాయి. కనీసం ప్రభుత్వం నడపటానికి కూడా డబ్బులు లేని పరిస్థితి.
ఆర్టికల్ 370, 35ఏ రద్దు అనంతరం పాకిస్తాన్ మనదేశంతో అన్ని సంబంధాలను తెంచుకుంది. దీంతో ఆ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తోంది. మన పంజాబ్ లో కిలో గోధుమ పిండి రూ. 30 ఉంటే.. పాకిస్తాన్ పంజాబ్ లో కిలో గోధుమపిండి ధర రూ.100ను దాటేసింది. భారత్ నుంచి ఆహార ధాన్యాలు, కూరగాయల దిగుమతిని ఆపేసినందుకు ఇప్పుడు పాకిస్తాన్ అనుభవిస్తోంది. తాజాగా అక్కడ గోధుమ పిండి ధర అక్కడ ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తోంది. దీంతో దేశంలో పలు చోట్ల గోధుమ పిండి కోసం తొక్కిసలాట, గందరగోళ పరిస్థితి నెలకొంది. సగటు ఆదాయాన్ని పొందే వ్యక్తి గోధుమ పిండిని కొనలేని పరిస్థితి ఉంది.
Read Also: Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఛార్జీలు, పెంపు ఎంతంటే !
పాక్ లోని పిండి మిల్లుల యజమానులు గోధుమ పిండి ధరను అకాస్మత్తుగా పెంచేశారు. ఏకంగా రూ.11 పెంచారు. దీంతో పంజాబ్, సింధ్ ప్రావిన్సుల్లో కిలో గోధుమ పిండి ధర రూ. 115కు చేరుకుంది. ఇదిలా ఉంటే ఇక మధ్యలో ఉన్న దళారులు ఆదివారం రోజు మరో రూ.10 పెంచారు. దీంతో కిలో పిండి ధర రూ. 125కు చేరుకుంది. చెప్పాలంటే భారత్ తో రూ. 340 కి 10 కేజీల పిండి ప్యాకెట్ లభిస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు 10 కిలోల గోధుమ పిండిని కొనుగోలు చేయాలంటే రూ. 1250 వెచ్చించాల్సిందే.
ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ లోని సింధ్ ప్రభుత్వం ఈ సీజన్ లో 1.4 మెట్రిక్ టన్నుల గోధుమలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రైతుల నుంచి ఒక మెట్రిక్ టన్ను, పాకిస్తాన్ అగ్రికల్చర్ స్టోరేజ్ సర్వీస్ కార్పొరేషన్ నుంచి 4 లక్షల టన్నులు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఇది ఎన్ని రోజుల పాటు ప్రజల ఆకలి తీరుస్తుందో చెప్పలేని పరిస్థితి. పెరిగిన ధరలు ఇప్పుడు తగ్గే పరిస్థితి లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.