ట్విటర్ మాధ్యమంగా ఛలోక్తులు పేల్చినంత మాత్రాన ఎలాన్ మస్క్ చాలా క్లాస్ & దయగలిగిన వ్యక్తి అనుకుంటున్నారా.. మాస్, ఊర మాస్! ఇందుకు తాజా పరిణామమే ప్రత్యక్ష సాక్ష్యం. ఈ ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత తన సంస్థ ఉద్యోగులకు ఇటీవల ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆఫీస్‌కి వచ్చి పని చేస్తేనే జాబ్ ఉంటుందని, లేకపోతే ఊడిపోవడం ఖాయమని ఆయన మెయిల్ పంపించాడు. దీంతో ఇది చర్చనీయాంశం అవుతోంది.
‘‘ఇకపై ఇంటి నుంచి లేదా ఇతర ప్రాంతాల నుంచి పని చేయడం ఆమోదయోగ్యం కాదు. రిమోట్ వర్క్ చేయాలనుకునేవారు వారంలో కనీసం 40 గంటలు కార్యాలయంలో ఉండాల్సిందే. లేదంటే టెస్లా నుంచి వెళ్లిపోవచ్చు’’ అంటూ ఎలాన్ మస్క్ తన ఉద్యోగులకు ఘాటుగా మెయిల్ పెట్టాడు. ఆఫీస్ అంటే ప్రధాన కార్యాలయానికి రావాల్సిందేనని, ఇతర బ్రాంచీలకు వెళ్లినా చెల్లదని ఆ మెయిల్‌లో తేల్చి చెప్పాడు. ఈ విషయంపై నెట్టింట్లో ఒక నెటిజన్ ఎలాన్ మస్క్‌కి ఓ ప్రశ్న సంధించాడు. ‘‘ఆఫీస్‌కి వెళ్లి పనిచేయడమన్నది పాత పద్ధతి, దీనిపై మీ స్పందనేంటి?’’ అని అడగ్గా.. ‘‘అటువంటి వారు వేరే చోట్ల పని చేస్తున్నట్టు అనుకోవాలి’’ అంటూ మస్క్ జవాబిచ్చాడు.
ఇదిలావుండగా.. ఎలాన్ మస్క్ తన సంస్థ ఉద్యోగులతో కఠినంగానే వ్యవహరిస్తారని గతంలోనే వార్తలొచ్చాయి. ఈ మెయిల్ సందర్భంగా కొందరు గతంలో చోటు చేసుకున్న సంఘటనల్ని గుర్తు చేసుకుంటున్నారు. అటు.. లాక్డౌన్ కారణంగా షాంఘైలోని టెస్లా కార్యాలయంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, కార్మికుల చేత వారానికి 12 గంటలు చొప్పున ఆరు రోజుల పాటు పని చేయిస్తున్నారని తెలుస్తోంది. కొందరైతే విధుల వల్ల అలసిపోయి, నేలపైనే పడుకుంటున్నట్టు వార్తలు సైతం వచ్చాయి.