Earthquake Hits Nepal: నేపాల్ మరోసారి భూకంపానికి గురైంది. రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ ర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రకారం..నేపాల్ రాజధాని ఖాట్మాండుకు 147 కిలోమీటర్ల దూరంలోని ఖోటాంగ్ జిల్లా మార్టిమ్ బిర్టా భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. ఆదివారం ఉదయం 8.13 గంటలకు భూకంపం సంభవించింది. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది. భూకంప కేంద్రం ఉపరితనం నుంచి 10 కిలోమీటర్ లోతులో ఉంది. నేపాల్ భూకంపాలు తరుచుగా వచ్చే ప్రాంతాల జాబితాలో ఉంది. ఇండియా ఉపఖండం టెక్లానిక్ ప్లేట్ తరుచుగా కదలుతుండటంతో హిమాలయ ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తుంటాయి.
Read Also: Joe Biden: యూఎస్ ప్రెసిడెంట్ కు మరోసారి కోవిడ్ పాజిటివ్
ఏప్రిల్ 25, 2015లో నేపాల్ లో సంభవించిన భూకంపం ఆ దేశంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రాజధాని ఖాట్మాండు, పోఖరా నగరాల మధ్య సంభవించిన భూకంపం వల్ల 8,964 మంది మరణించారు..22,000 మంది గాయపడినట్లు అంచనా. గోర్ఖా భూకంపంగా పిలువబడే ఈ భూకంపం 7.8 తీవ్రతతో వచ్చింది. దీని ధాటికి నేపాల్ తో సహా ఇండియా, పాకిస్తాన్ లోని లాహోర్, టిబెట్ లోని లాసా, బంగ్లాదేశ్ ఢాకాలో కూడా ప్రకంపనలు వచ్చాయి. భూకంపం ధాటికి ఖాట్మాండు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును కూడా మూసేశారు. భూకంపం వల్ల ఎవరెస్ట్ శిఖరంపై హిమపాతం, అవలాంచ్ సంభవించి 22 మంది మరణించారు. దీని తర్వాత కూడా మే 12,2015లో కూడా మరోసారి నేపాల్ లో భూకంపం వచ్చింది. దీని వల్ల 200 మంది మరణించడంతో పాటు 2500 మంది గాయపడ్డారు. నేపాల్ లో 1934లో అత్యంత శక్తివంతమైన భూకంపం వచ్చింది. దాదాపుగా 8.0 మ్యాగ్నిట్యూడ్ తో భూకంపం సంభవించింది. ఖాట్మాండుతో పాటు భక్తపూర్, పటాన్ నగరాలు దారుణంగా నాశనం అయ్యాయి. తరుచుగా హిమాలయ ప్రాంతంలో భూకంపాలు సంభవిస్తుండటంతో హిమాలయాల ఎత్తు పెరుగుతోందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.