Chinese Travellers Rushing To Hong Kong For mRNA Covid Vaccines: చైనాను కోవిడ్ మహమ్మారి హడలెత్తిస్తోంది. ఎప్పుడూ చూడని విధంగా చైనా ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. ప్రభుత్వం ‘జీరో కోవిడ్’ విధానాన్ని ఎత్తేయడం, అత్యంత వేగంగా వ్యాపించే ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ కారణంగా అక్కడ కేసులు, మరణాల సంఖ్య పెరిగింది. రాజధాని బీజింగ్, షాంఘై ఇతర నగరాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆస్పత్రుల్లో బెడ్లు కూడా ఖాళీ లేకుండా రోగులతో నిండిపోయాయి.
Read Also: Jayasudha: 64 ఏళ్ల వయస్సులో మూడో పెళ్లి చేసుకున్న జయసుధ.. ?
ఇదిలా ఉంటే ఇప్పుడు చైనా ప్రజలు వ్యాక్సిన్ కోసం పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా చైనా ప్రధాన భూభాగం నుంచి ప్రజలు హాంకాంగ్ కు వెళ్తున్నారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ కోసం చైనా ప్రజలు పెద్ద ఎత్తున హాంకాంగ్ వెళ్తున్నారు. చైనా ప్రధాన భూభాగంలో ఈ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. చైనాలో ఇచ్చిన కరోనా వ్యాక్సిన్లు సరిగ్గా పనిచేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది చైనా తయారీ సినోవాక్ వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ ఫైజర్-బయోఎన్ టెక్ తయారు చేసిన బైవాలెంట్ బూస్టర్ డోసును తీసుకుంటున్నారు.
2019లో చైనాలోని వూహాన్ నగరంలో మొదటిసారిగా కరోనా కేసులు బయటపడ్డాయి. ఆ తరువాత ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాధి విస్తరించింది. అయితే చైనాలో నిర్భంధంగా ‘జీరో కోవిడ్’ విధానాన్ని అనుసరించడంతో అక్కడ కేసుల సంఖ్య తక్కువగానే నమోదు అవుతూ వచ్చింది. అయితే ఈ లాక్ డౌన్లు ఎడాపెడా పెట్టడం వల్ల ప్రజల ఆదాయం దెబ్బతింది. దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలై, నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వ జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తేయడంతో పాటు లాక్ డౌన్లను సడలించింది. దీంతో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగింది. చైనీస్ న్యూఇయర్ వస్తుండటంతో కనీవిని ఎరగని రీతిలో కేసులు నమోదు అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.