కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత వారం రోజులుగా చైనాలోని పలు నగరాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దక్షిణ చైనాలోని సాంకేతిక కేంద్రమైన షెన్‌జెన్‌లో తాజాగా అధికారులు కఠినమైన లాక్‌డౌన్ విధించారు. దీంతో షెన్‌జెన్ నగరంలోని 90 లక్షల మంది ప్రజలు ఇళ్లకు పరిమితం అయ్యారు. మరోవైపు దాదాపు 5లక్షల జనాభా ఉన్న షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని యుచెంగ్‌లో కూడా లాక్‌డౌన్ ఆంక్షలు జారీ చేశారు. రెండు రోజుల కిందట జిలిన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్‌చున్‌లో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
దీంతో ప్రస్తుతం చైనాలోని మూడు నగరాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. హువావే, టెన్‌సెంట్ వంటి ప్రధాన కంపెనీల ప్రధాన కార్యాలయాలు షెన్‌జెన్‌లో ఉండగా.. ఈ నగరం హాంకాంగ్‌తో సరిహద్దును పంచుకుంటుంది. ఇక్కడ ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. మరోవైపు చైనాలో రెండేళ్ల తర్వాత అత్యధికంగా కరోనా కేసులు చైనాలో శనివారం నమోదయ్యాయి. కరోనా కేసుల నేపథ్యంలో పలు నగరాలతో పాటు షాంఘైలో పాఠశాలలు, పార్క్‌లను అధికారులు మూసివేశారు. బీజింగ్‌లో బహిరంగ ప్రదేశాల్లో ప్రవేశాన్ని నిషేధించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని బీజింగ్‌లోని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప ప్రజలు నగరాన్ని విడిచి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు.