Zelensky: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించి ఈ ఏడాది ఫిబ్రవరికి సంవత్సరం గడిచింది. అయితే ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం యుద్దం ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే క్రిమియాను కోల్పోయిన ఉక్రెయిన్, ఖేర్సర్, లూహాన్స్క్, డోనెట్స్క్, జపొరిజ్జియా ప్రాంతాలను కూడా కోల్పోయింది. మరియోపోల్, సుమీ, ఖార్కీవ్ వంటి నగరాలు నామరూపాలు లేకుండా ధ్వంసం అవుతున్నాయి. ప్రతీ రోజు రష్యా జరిపే రాకెట్ దాడులతో అక్కడి నేలంతా నల్లగా మారిపోయింది. యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి.
Read Also: The Kerala Story: “ది కేరళ స్టోరీ” సినిమా ఆర్ఎస్ఎస్ కుట్ర.. సీఎం పినరయి విజయన్ విమర్శలు..
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై రష్యన్లు దాడి చేసి బందీగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తే చివరివరకు పోరాడుతానని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అధ్యక్ష కార్యాలయంలోకి శత్రువులు ప్రవేశిస్తే, నేడు మేం ఇక్కడ ఉండేవాళ్లం కాదు అని, ఉక్రెయిన్ అధ్యక్షుడిని రష్యన్లు బందీగా తీసుకెళ్తున్నారు అంటే మీరు ఊహించగలరా..? ఇది అవమానకరం అని నమ్ముతా అని జెలన్ స్కీ అన్నారు.
ఫిబ్రవరి 24, 2022 దండయాత్ర తర్వాత మొదటి రోజులలో, రష్యా ఇంటెలిజెన్స్ విభాగాలు కైవ్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని, అయితే ఉక్రెయిన్ అధికారులు వీరిని అడ్డుకున్నారని, ఫలితంగా అధ్యక్ష భవనం ఉన్న సెంటర్‌లోని బంకోవా స్ట్రీట్‌కు చేరుకోవడంలో విఫలమయ్యారని చెప్పారు. రష్యన్ బలగాలు కీవ్ శివార్లలో దాడులు ప్రారంభించాయి అయితే అవి నగరంలోకి చేరుకోలేకపోయాయని ఆయన అన్నారు. ఆ సమయంలో తన వద్ద తుపాకీ ఉందని, తనకు ఫైర్ చేయడం వచ్చని అన్నారు. అయితే రష్యన్లకు బందీగా చిక్కకుండా కాల్చుకుని ఉండేవారా..? అనే ప్రశ్నకు సమాధానంగా శతృవులపై దాడి చేసేందుకు ఉపయోగించే వాడినని అన్నారు.