Greece: వలసదారులతో వెళ్తున్న పడవ మధ్యదరా సముద్రంలో మునిగిపోయింది. గ్రీస్ తీరానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం జరిగిన ఈ దుర్ఘటనలో 78 మంది మరణించారు. చాలా మంది గల్లంతయ్యారు. పెలోపొన్నీస్ తీరానికి సమీపంలోని పైలోస్ పట్టణానికి నైరుతి దిశలో 87 కిలోమీటర్లు దూరంలో అంతర్జాతీయ జలాల్లో పడవ బోల్తా పడిందని గ్రీక్ కోస్ట్‌గార్డ్ తెలిపింది. ఓడ తూర్పు లిబియా నుంచి ఇటలీకి వలసదారులతో వెళ్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించిన వారిలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ జాతీయులే ఎక్కువగా ఉన్నారు.
Read Also: Tarun Chugh : మోడీ దేశానికి యజమాని కాదు.. సేవకుడు మాత్రమే
ఇప్పటి వరకు 104 మంది ప్రయాణికులను రక్షించినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాద సమయంలో పడవలో ఎంతమంది ఉన్నారో స్పష్టంగా తెలియరాలేదు. అధికారులు మాత్రం 400-700 మంది వరకు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పశ్చిమాసియా, ఆఫ్రికా నుంచి పెద్ద సంఖ్యలో వలసలు సాగుతున్నాయి. ఆయా దేశాల్లో సంక్షోభం, హింస కారణంగా చాలా మంది పొట్టచేత పట్టుకుని యూరప్ దేశాలకు వలస వెళ్తున్నారు. ఇలా వలసవెళ్లేవారికి గ్రీస్ దేశం యూరప్ యూనియన్ లోకి గేట్ వేగా మారింది. అనేక మంది టర్కీ నుంచి గ్రీస్ దేశంలోని ద్వీపాలకు పడవల ద్వారా ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.