ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిన తరువాత అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆగస్టు 31 లోగా దేశం విడిచి వెళ్లాలని తాలిబన్లు ఇప్పటికే అమెరికా దళాలను ఆదేశించారు. ఇక ఇదిలా ఉంటే, నిన్నటి రోజున ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని, కాబూల్ ఎయిర్‌పోర్టు వైపు ఎవరూ రావొద్దని అగ్రదేశాల నిఘా సంస్థలు హెచ్చరించారు. ఈహెచ్చరికలు జరిగిన గంటల వ్యవధిలోనే కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద రెండు బాంబుదాడులు జరిగాయి. ఈ దాడిలో 72 మంది మృతి చెందగా, 140 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ఆఫ్ఘన్ పౌరులతో పాటుగా, 14 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. కాబూల్ ఎయిర్‌పోర్ట్ మొత్తం రక్తసిక్తంగా మారింది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉన్నట్టుగా నిఘా వర్గాలు హెచ్చరించాయి.