అమెరికా అంటువ్యాధుల కమిటీ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కరోనా విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ కేసులు అమెరికాలో రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్‌ను అందిస్తున్నా కేసులు పెరుగుతుండటంపై సర్వత్రా అందోళన పెరుగుతున్నది. కరోనాను సమూలంగా అంతం చేయడం అసాధ్యమని డాక్టర్ ఫౌచీ పేర్కొన్నారు. కరోనాతో కలిసి జీవించాల్సిందే అని కుండబద్దలు కొట్టారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరిలో వైరస్ కనిపిస్తుందని, అయితే, వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఆ వ్యాక్తుల్లో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని, వ్యాక్సిన్ తీసుకోనివారిలో వ్యాధి లక్షణాలు అధికంగా ఉంటాయని, అయితే, ఎవరూ కూడా కరోనా నుంచి తప్పించుకోలేరని అంటోనీ ఫౌచీ స్పష్టం చేశారు. కొత్తగా పుట్టుకొస్తున్న మ్యూటేషన్ల కారణంగా కోవిడ్‌ను సమూలంగా నిర్మూలించడం ఎప్పటికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికా కోవిడ్‌తో కలిసి బతికే దశకు చేరుకుందని అన్నారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు కొంతకాలమే పనిచేస్తాయని, పూర్తిస్థాయిలో రక్షణ ఇవ్వలేవని ఫౌచీ స్పష్టం చేశారు.
Read: ఒమిక్రాన్ ఎఫెక్ట్: లాక్‌డౌన్‌లో మరో నగరం…
అమెరికాలో ప్రతిరోజూ 13 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. లక్ష నుంచి లక్షన్నర మంది ఆసుపత్రులో చేరుతున్నారు. రోజుకు 1200 మంది వరకు మరణిస్తున్నారు. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో మరింత అధికం అయ్యే అవకాశం ఉంది. అయితే, డెల్టా వేరియంట్ కంటే తీవ్రత ఒమిక్రాన్ వలన తక్కువగా ఉండటంతో కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. వ్యాక్సిన్ తీసుకోనివారిపైనే తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇతర వ్యాధులు ఉన్నవారిపై ఈ వేరియంట్ ప్రభావం ఎక్కువగానే ఉంది. గతంలో వేసిన అంచనాలకు మించి కేసులు నమోదవుతున్నా, మరణాల సంఖ్య తక్కువగా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం.