ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులను యావత్తు ప్రపంచ దేశాలు చూస్తూనే ఉన్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై వార్ డిక్లర్ చేయకనే చేశారు. అయితే దీనిపై ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోరాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎవరైనా ఉక్రెయిన్ వ్యవహారంలో తలదూర్చితే ఎక్కడివరకైనా పోయేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పుతిన్ సంకేతాలు పంపారు. అయితే ఎప్పటినుంచో అగ్రరాజ్యం అమెరికా, రష్యాలకు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో అమెరికా ఎలాంటి అడుగులు వేయనుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ యుద్ధంపై అమెరికా వైఖరి ఏమిటో కాసేపట్లోనే తేలిపోనుంది. రష్యా, ఉక్రెయిన్‌ల యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ రాత్రి 11 గంటలకు ఓ ప్రకటన చేయనున్నారు.
ఈ క్రమంలో రష్యాకు వ్యతిరేకంగానే అమెరికా అడుగులు వేస్తుందన్నది విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ఆ మాట నిజమేనన్నట్లుగా రష్యాను నిలువరించేలా యత్నిస్తున్న నాటో కూటమికి మద్దతుగా నిలవనున్నట్లుగా ఇదివరకే అమెరికా వెల్లడించింది. అయితే ఆ మాట ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగకముందు చేసిన ప్రకటన. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో అమెరికా ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందోనన్న విషయంపై యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.