Celestial Wonder: ఫిబ్రవరిలో ఖగోళ అద్భుతం దర్శనమివ్వబోతోంది. గత 50,000 ఏళ్లుగా కనిపించని కొత్త తోకచుక్క C/2022 E3 (ZTF) రాబోయే కొన్ని వారాల్లో కంటికి కనిపించనుంది. ఫిబ్రవరి 2న భూమికి అత్యంత దగ్గరగా రాబోతోంది. రాత్రి ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపించబోతోంది. నాసా ప్రకారం.. జ్వికీ ట్రాన్సియెంట్ ఫెసిలిటీలోని వైడ్-ఫీల్డ్ సర్వే కెమెరా ద్వారా ఖగోళ శాస్త్రవేత్తలు ఈ తోకచుక్కను గతేడాది మార్చిలో గుర్తించారు. ప్రస్తుతం ఈ తోకచుక్క గురు గ్రహం కక్ష్యలో ఉంది.
తోకచుక్క సూర్యుడి చుట్టూ తిరిగే సమయంలో సూర్యుడి కాంతి ఘనీభవించిన వాయువులు, రాళ్లు, ధూళిపై పడటంతో తోక రూపంలో కనిపిస్తుంది. తోకచుక్కలు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు తోక ఆకారంలో ఉన్న వాయువులు వేడెక్కుతాయి. దీని ఆకారం చాలా గ్రహాల కంటే పెద్దదిగా ఉంటుంది.
Read Also: IND Vs SL: సెంచరీతో సూర్యకుమార్ విధ్వంసం.. మూడో టీ20లో భారత్ భారీ స్కోరు
అమెరికన్ స్పేస్ ఏజెన్సీ ప్రకారం C/2022 E3 (ZTF) తోకచుక్క ప్రస్తుతం అంతర్గత సౌరవ్యవస్థ గుండా వెళుతోంది. రాబోయే వారాాల్లో మన గ్రహానికి చేరుకోవచ్చు. జనవరి 12న సూర్యుడికి దగ్గర వెళ్తుంది. ఫిబ్రవరి 2న భూమిని దాటుతుంది. ఆ సమయంలో మన గ్రహానికి 42.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్పేస్.కామ్ ప్రకారం ఈ తోకచుక్క కక్ష్య కాలం సుమారు 50,000 సంవత్సరాలుగా నిర్ణయించారు. అంటే 50,000 ఏళ్ల తరువాత తొలిసారిగా భూమికి దగ్గరగా రాబోతోంది.
అయితే తోకచుక్క ప్రకాశాన్ని అంచనా వేయడం కష్టం.. అయితే భూమికి దగ్గరగా వచ్చే సమయానికి రాత్రి ఆకాశంలో ఇది ఎలాంటి పరికరాల సహాయం లేకుండా కంటికి కనిపించనుంది. ఉత్తరార్థగోళంలో తెల్లవారుజామున ఆకాశంలో కనిపించే అవకాశం ఉంది. దక్షిణ ఆర్థగోళంలో ఉన్నవారికి ఫిబ్రవరి ప్రారంభంలో కనిపిస్తుంది.