Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో 30-40 మంది వరకు టెర్రరిస్టులు ఉన్నట్లు పంజాబ్ ప్రభుత్వం, పంజాబ్ పోలీసులు ఆరోపించారు. వారందరిని అప్పగించాలని ఇమ్రాన్ ఖాన్ కు డెడ్ లైన్ కూడా ఇచ్చారు. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఇటీవల మీడియా ప్రతినిధులను తన ఇంటికి రమ్మని అంతా చూపించారు. పని మనుషులు తప్పితే ఎవరూ లేరని, తనపై అబద్దపు ఆరోపణలు చేస్తున్నట్లు ఆరోపించారు.
Read Also: Road accident: బ్యాచిలర్ పార్టీకి వెళుతూ ఘోరం.. ముగ్గురు మృతి.. 9 మందికి గాయాలు
ఇదిలా ఉంటే లాహోర్ లోని ఇమ్రాన్ ఖాన్ నివాసం జమాన్ పార్క్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన ఆరుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు పంజాబ్ పోలీసులు ప్రకటించారు. గంటల తరబడి భద్రతా చర్యల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో అరెస్టైన వారి సంఖ్య 14కు చేరుకుందని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ఇటీవల ఆర్మీ కోర్ కమాండర్ ఇంటిలో విధ్వంసానికి పాల్పడిన ఘటనలో వాంటెండ్ గా ఉన్న వ్యక్తి పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు.
లాహోర్ లోని ఇమ్రాన్ ఖాన్ ఇంటిని గురువారం భారీ సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టారు. వారిని అప్పగించేందుకు ప్రభుత్వం విధించిన 24 గంటల గడువు ముగియడంతో, పోలీసులు ఉగ్రవాదులను అరెస్ట్ చేయడానికి శుక్రవారం ఎప్పుడైనా భద్రత చర్యలను ప్రారంభించవచ్చని తెలుస్తోంది. మే 9న ఇస్లామాబాద్ కోర్టు ప్రాంగణంలో పాక్ పారామిలిటరీ రేంజర్లు ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదలయ్యారు. ఇమ్రాన్ అరెస్ట్ తర్వాత ఆయన మద్దతుదారులు పాకిస్తాన్ వ్యాప్తంగా ఆందోళన, విధ్వంసాలకు దిగారు. ఈ నేపథ్యంలో ఆర్మీని టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడ్డారు.