జగిత్యాలలో దారుణం చోటుచేసుకుంది. ఒక మహిళ తనకంటూ ఎవరు లేని జీవితం ఎందుకు అనుకుంది.. ఎవరికి భారం కాకూడదనుకుంది. కళ్లముందే కొడుకు, కోడలు మరణాన్ని చూసింది.. మనవడికి భారం కాకుండా తన దారిన తను వెళ్లిపోవాలనుకొని కఠినమైన నిర్ణయం తీసుకొంది. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆమె.. ఆ మంచాన్నే తన చితిగా మార్చుకొంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో మంచానికి నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బంజరుదొడ్డి ప్రాంతానికి చెందిన బొండ ఈరమ్మ భర్త రత్నం ఇరవై ఏళ్ల క్రితమే మృతి చెందాడు. దీంతో కూలీ నాలీ చేసుకుంటూ తన కొడుకును పెంచి పెళ్లి చేసింది. విధి వక్రించడంతో 8 ఏళ్ల క్రితం కొడుకు, కోడలు ఇద్దరు ప్రమాదంలో మృతి చెందారు. అప్పటినుంచి మనవడిని పెంచుతూ జీవిస్తున్న ఆమె గత కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో పోరాడుతూ మంచానికే పరిమితమయ్యింది. ఇక మనవడు తెచ్చే కూలీ డబ్బుతోతింటూ జీవనం సాగిస్తుండగా.. ఈరమ్మకు ఇటీవల క్యాన్సర్ సోకింది.. అందుకు అయ్యె ఖర్చు భరించలేనిదిగా ఉండడంతో ఆమె తట్టుకోలేక పోయింది.. తన ఆసుపత్రి ఖర్చుల కోసం మనవడిని ఇబ్బంది పెట్టకూడదనుకొంది. మంగళవారం ఇంట్లో ఎవరులేని సమయంలో తన మంచానికి నిప్పు పెట్టుకొని సజీవ దహనం అయ్యింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.