UP News: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ప్రేమ జంటను యువతి కుటుంబీకులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన యూపీలోని లలిత్‌పూర్ జిల్లాలో న్యూ ఇయర్ రోజు జరిగింది. 22 ఏళ్ల వ్యక్తి, 19 ఏళ్ల యువతిని ఆమె కుటుంబ సభ్యులు హత్య చేశారని, ఆ తర్వాత హత్యలను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని సోమవారం పోలీసులు తెలిపారు. యువతి తండ్రి, తల్లి, మామలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
చనిపోయిన వ్యక్తిని మిథున్ కుష్వాహాగా, యువతిని కామినీ సాహుగా గుర్తించారు. లలిత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జఖౌరా ప్రాంతంలోని బిఘా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ ముహమ్ద్ ముస్తాక్ ప్రకారం.. వీరిద్దరు కలిసి ఉండటం యువతి కుటుంబానికి ఇష్టం లేదు. దీనిపై గతంలో పంచాయతీ జరిగింది. సాహు పెళ్లి చేసుకునే వరకు కుష్వాహా గ్రామానికి దూరంగా ఉండాలని పెద్దలు ఆదేశించారు. మిథున్ కుష్వాహా గ్రామం వెలుపల తన మామతో కలిసి ఉంటున్నాడు. అయితే, అర్థరాత్రి కామినీ సాహు ఇంటికి రహస్యంగా వెళ్లేవాడు.
Read Also: Earthquake: హిమాలయాల్లో ఏదో రోజు విధ్వంసమే.. భూకంపాలకు కారణమేంటి..?
మిథున్ కుష్వాహా తమ కుమార్తెను రహస్యంగా కలిసేందుకు వస్తున్నాడని తెలిసింది. సాహు పుట్టిన రోజైన జనవరి 01న మళ్లీ వస్తాడని తెలుసుకుని కుటుంబం మొత్తం కలిసి హత్యలకు ప్లాన్ చేశారు. అర్థరాత్రి ఇంటికి వచ్చిన మిథున్ కుష్వాహాన కాళ్లను కట్టేసి, బలవంతంగా విషం తాగించి, ఆపై గొంతు కోసి చంపారు. దీనిపై కామినీ సాహు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో ఆమెకు కూడా విషం తాగించి, గొంతు కోసి చంపారు.
అయితే, ఈ హత్యల్ని ఆత్మహత్యలుగా మార్చే ప్రయత్నం చేశారు. వ్యక్తి మృతదేహాన్ని చెట్లుకు వేలడదీశారు. యువతి మృతదేహాన్ని తమ ఇంటి వెనక పడేసినట్లు ఎస్పీ తెలిపారు. మహిళ కుటుంబం మొత్తం యువతి తప్పిపోయినట్లు నటించారు. గ్రామస్తులతో కలిసి ఆమెను వెతికారు. రెండు మృతదేహాలను గుర్తించడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ప్రాథమికంగా ఆత్మహత్యలుగా అనుమానించిన పోలీసులు, డెడ్‌బాడీలను పోస్ట్‌మార్టంకి తరలించారు. అయితే, రిపోర్టులో గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. ఈ కేసులో యువతి తండ్రి సునీల్ సాహు, ఆమె తల్లి రాందేవి సాహు, ఆమె మామ దేశరాజ్ సాహుని అరెస్ట్ చయేశారు.