Earthquake: మరోసారి హిమాలయాల్లో భూకంపం వచ్చింది. టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో ఎవరెస్ట్ శిఖరానికి సమీపంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిసింది. 7.1 మాగ్నిట్యూడ్‌తో భారీ భూకంపం రావడంతో నేపాల్, ఉత్తర భారత్, టిబెట్ ప్రాంతాలు వణికిపోయాయి. టిబెట్ రాజధాని లాసాకు నైరుతి దిశలో 400 కి.మీ దూరంలోని టింగ్రీ కౌంటీలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఎవరెస్ట్ పర్వతాన్ని సందర్శించే వారికి ఇది పర్యాటక కేంద్రంగా ఉంది. 90కి మందికి పైగా ప్రజలు మరణించారు.
హిమాలయాల్లోనే ఎందుకు భూకంపాలు..?
గత 150 ఏళ్లలో హిమాలయ ప్రాంతాల్లో నాలుగు భారీ భూకంపాలు సంభవించాయి. రానున్న రోజుల్లో కూడా 8 లేదా అంతకన్నా ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, ఆసియా టెక్టానిక్ ప్లేట్ ముందుకు నెడుతోంది. భూ అంతర్భాగంలో జరిగి ఈ ఘర్షణ ఫలితంగా భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి. నిజానికి హిమాలయాలు కూడా కొన్ని కోట్ల ఏళ్ల క్రితం జరిగిన ఈ ప్రక్రియ ద్వారానే ఉద్భవించాయి. ప్రతీ ఏడాది కూడా ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ కొన్ని మిల్లీమీటర్ల మేర ఉత్తర దిశగా ముందుకు నెడుతోంది. దీని వల్ల హిమాలయాల ఎత్తు కూడా నెమ్మదిగా పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
Read Also: Chinese Manjha: యువకుడి ప్రాణం తీసిన చైనీస్ మాంజా.. గొంతు కోయడంతో మృతి..
ఈ క్రమంలోనే ఏదో రోజు హిమాలయాల్లో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్ పై ఏడు లేదా అంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది ఎప్పుడు జరుగుతుందో స్పష్టంగా చెప్పలేమని.. అయితే ఇది ఒక రోజు తర్వాత జరగవచ్చు, లేకపోతే ఓ వందేళ్ల తరువాతైన ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 1897లో షిల్లాంగ్‌లో, 1905లో కాంగ్రాలో, 1934లో బీహార్-నేపాల్‌లో, 1950లో అస్సాంలో సంభవించిన ప్రకంపనలతో సహా, గత 150 ఏళ్లలో హిమాలయ ప్రాంతంలో నాలుగు భారీ భూకంపాలు నమోదయ్యాయి. 1991లో ఉత్తరకాశీలో భూకంపం సంభవించగా, 1999లో చమోలిలో, 2015లో నేపాల్‌లో భూకంపాలు సంభవించాయి.
హిమాలయ దేశం నేపాల్ చాలా తీవ్రమైన భూకంపాలను ఎదుర్కొంటోంది. 2015లో, నేపాల్‌లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల దాదాపు 9,000 మంది మరణించారు మరియు 22,000 మందికి పైగా గాయపడ్డారు, అర మిలియన్లకు పైగా గృహాలు ధ్వంసమయ్యాయి.