రోజురోజుకు భార్యాభర్తల సంబంధాలు దెబ్బతింటున్నాయి. కలకాలం కలిసుండాల్సిన ఆలుమగల మధ్యలోకి మరొకరు ప్రవేశించడంతో కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. క్షణిక సుఖం కోసం అడ్డదారులు తొక్కడంతో సంసార జీవితం అతలాకుతలం అయిపోతున్నాయి. రోజూ ఎక్కడో చోట ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. ప్రియుడితో సుఖానికి భర్త అడ్డొస్తున్నాడని.. ఇంట్లోనే మరణశాసనం రాసింది ఓ దుర్మార్గురాలు. ప్రియుడితో కలిసి పతిని తుది ముట్టించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఠాకూర్‌గంజ్‌లో చోటుచేసుకుంది.
శత్రుఘ్న రాథోడ్ (50), రాఖీ రాథోడ్ భార్యాభర్తలు. శత్రుఘ్న రాథోడ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఈ దంపతులకు నలుగురు కుమార్తెలు. అయితే శత్రుఘ్న రాథోడ్ పనుల నిమిత్తం బయటకు వెళ్లాడు. దీంతో రాఖీ రాథోడ్ దారి తప్పింది. ధర్మేంద్ర రాథోడ్ (40) అనే ఓ ట్రావెల్ వ్యాపారితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త, పిల్లలు ఇంట్లో లేని సమయంలో ఇద్దరూ ఏకాంతంగా కలుసుకుంటూ ఉండేవారు. ఇలా అక్రమ సంబంధం సాగిపోతుండగా.. ఒకసారి హఠాత్తుగా భర్త శత్రుఘ్న రాథోడ్ కంట్లో పడ్డారు. దీంతో ఇద్దరిని తీవ్రంగా హెచ్చరించాడు. అంతే అప్పటి నుంచి కసితో రగిలిపోయారు. తమ సుఖానికి అడ్డొస్తున్న భర్తను అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నారు. అంతే డిసెంబర్ 30, 2024న హత్యకు ప్లాన్ వేశారు.
శత్రుఘ్న రాథోడ్ పనులు ముగించుకుని డిసెంబర్ 30న రాత్రి ఇంటికి వచ్చాడు. భోజనం చేశాక ఓ గదిలోకి వెళ్లి పడుకున్నాడు. తల్లి, నలుగురు కూతుళ్ల మరొక గదిలో నిద్రించారు. అయితే అర్ధరాత్రి 1:30 సమయంలో ధర్మేంద్ర రాథోడ్, అతని సోదరుడు అంకిత్ రాథోడ్, వాళ్ల స్నేహితుడు రంజిత్ విశ్వకర్మ ఇంట్లోకి ప్రవేశించి శత్రుఘ్న రాథోడ్ ప్రాణాలు తీశారు. అయితే డోర్ తీసిన సౌండ్ వినపడడంతో మెలకువుగా ఉన్న పెద్ద కుమార్తె లేచి.. ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసింది. దీంతో నిందితులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ పరిణామంలో 18 అడుగుల టెర్రస్ గోడపై నుంచి కిందకి దూకారు. నిందితుల్లో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. సమీపంలో ఉన్న ఓ సీసీకెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అయితే తన భర్తను దుండగులు చంపేశారని రాఖీ రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాము పడుకున్న డోర్ తలుపు గొళ్లెం ఎవరో బయటపెట్టారని పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రాఖీ రాథోడ్‌ను అదుపులో తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా.. ధర్మేంద్ర రాథోడ్‌తో ఉన్న అక్రమ సంబంధం బయటపడింది. గుండెపోటుతో భర్త చనిపోయినట్లుగా.. సాధారణ మరణంగా చిత్రీకరించాలని నిందితులు చూశారని.. పెద్ద కుమార్తె నిద్ర లేవడంతో మర్డర్ ఫ్లాన్ విఫలమైందని డీసీపీ వెస్ట్ విశ్వజీత్ శ్రీవాస్తవ చెప్పారు. రాఖీ రాథోడ్‌తో సహా నిందితులు ధర్మేంద్ర రాథోడ్, అంకిత్ రాథోడ్, రంజిత్ విశ్వకర్మలను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. భర్త భూమ్మీద లేకపోవడం, తల్లి జైలుకు వెళ్లడంతో నలుగురు కుమార్తెలు తల్లిదండ్రులు లేని అనాథలయ్యారు.