ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా బంగారం పట్టుబడింది. విదేశీ ప్రయాణీకుల వద్ద 10 కోట్ల విలువ చేసే 21.2 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుండి ముంబాయి వచ్చిన 16 మంది విదేశీ ప్రయాణీకులు వద్ద ఈ బంగారం దొరికింది. అయితే.. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారం బిస్కట్ లను బ్యాగ్ లో దాచారు కేటుగాళ్లు. ముంబై ఎయిర్ పోర్ట్ లో విమానం దిగగానే కస్టమ్స్ అధికారులతో గొడవకు దిగారు విదేశీ ప్రయాణీకులు. కస్టమ్స్ అధికారుల దృష్టి మరలించడానికి 16 మంది విదేశీ ప్రయాణికులు అరుపులు, కేకలతో నానా హంగామా చేశారు.
చాకచక్యంగా వ్యవహరించి 16 మందిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ బృందం.. తమదైన స్టైల్ లో విచారణ చేసి బ్యాక్ ప్యాక్ లో దాచిన 20 కేజీల బంగారం గుట్టును రట్టు చేశారు. విదేశీ ప్రయాణీకుల ఎత్తును చిత్తు చేసిన కస్టమ్స్ అధికారులు.. ముగ్గురు ప్రయాణీకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ గ్యాంగ్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.