వైద్యులు అంటే దేవుడి తరువాత దేవుళ్ళు అంటారు.. దేవుడు ప్రాణం పోస్తే.. ఆ ప్రాణాన్ని చివరివరకు కాపాడేది వైద్యుడే. కానీ అలాంటి వైద్య వృత్తిలో ఉంది కొందరు డబ్బు కోసం పాకులాడుతున్నారు. డబ్బు వస్తే చాలు మనిషి ఉన్నా పోయిన పట్టించుకోవడంలేదు. ఆపరేషన్ పేరుతో పేషంట్ పుర్రెను తొలగించి.. చివరకు అతికించకుండానే డిశ్చార్జ్ చేసిన ఘటన వరంగల్ హాస్పిటల్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ చెన్నారావు పేటకు చెందిన మల్లేశ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పేషేంట్ పరిస్థితి విషంగా ఉందని వెంటనే శస్త్ర చికిత్స చేయాలనీ తెలిపారు. న్యూరో సమస్యతో ఆసుపత్రిలో చేరిన పేషెంట్ తల పైభాగం వేరు చేసి ఆపరేషన్ చేశారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ పుర్రె భాగాన్ని అలాగే అతికించకుండా వదిలేసి.. ‘ఠాగూర్’ డ్రామా మొదలుపెట్టారు.
పేషెంట్ కండిషన్ క్రిటికల్ గా ఉందని కుటుంబ సభ్యుల ముందు హడావిడి చేశారు. అనంతరం తమ ఆసుపత్రికి చెడ్డపేరురాకుండా ఉండాలని రోగిని డిశ్చార్జ్ చేసేశారు. అది కూడా కుటుంబ సబ్యులకు తెలియకుండా ఆరోగ్య సిబ్బందితో కుమ్మక్కై డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేశారు. తలపై పుర్రె పైభాగం వేరు చేసి పరిస్థితి విషమంగా ఉన్న పేషెంట్ ను అనాథలా వదిలేశారు. ఆరోగ్య శ్రీ లో ఆరురోజుల మాత్రమే ఫ్రీ గా వైద్యం చేస్తారని, ఇప్పుడు టైమ్ దాటిపోయిందని, పేషెంట్ ను తీసుకెళ్లిపోవచ్చని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ట్రీట్ మెంట్ చేయాలంటే రోజుకు లక్ష రూపాయల వరకు ఖర్చవుతుందని అందుకు సిద్ధమైతేనే ఆసుపత్రిలో ఉంచాలని… లేదంటే ఎంజీఎంకు తరలించాలని పేషంట్ బంధువులను బెదిరించారు. ఆసుపత్రి సిబ్బంది బెదిరింపులకు భయపడి పేషంటును ఎంజీఎంకు తరలించారు. అయితే పేషేంట్ తాలూకు పుర్రె పై భాగం ప్రైవేట్ ఆసుపత్రిలోనే ఉండిపోయింది. ఇప్పుడు పేషంట్ బంధువులు అయోమయంలో ఉన్నారు. ప్రైవేటు హాస్పిటల్ సిబ్బంది, ఆరోగ్య శ్రీ సిబ్బంది పరస్పరం విరుద్ధమైన నివేదికలు ఇచ్చారని, తమకు న్యాయం చేయాలని పేషెంట్ బంధువులు డిమాండ్ చేస్తున్నారు.