ఆమె ఓ వివాహిత.. తొలుత సరదా కోసం ఆన్‌లైన్ రమ్మీ ఆడటం మొదలుపెట్టింది.. తర్వాత అది అలవాటైంది.. అనంతరం ఆ ఆటకి బానిసైంది. ఎంతలా అంటే.. లక్షల్లో అప్పులు చేసింది. నగలు కూడా విక్రయించింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. చివరికి ఆ భారం భరించలేక.. ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
చావడిలోని ఓ హెల్త్ కేర్ సంస్థలో పని చేస్తోన్న భాగ్యరాజ్ కందన్.. ఆరేళ్ల క్రితం భవాని(29)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఖాళీగా ఉంటున్న సమయంలో.. భవాని ఆన్‌లైన్ రమ్మీకి ఆకర్షితురాలైంది. మొదట్లో టైంపాస్ కోసం ఈ ఆటని ఆడటం మొదలుపెట్టింది. తర్వాత అది వ్యసనంగా మారింది. ఆ గేమ్ ఆడేందుకు భర్తకు తెలియకుండా బ్యాంక్‌లో నగదును జమ చేసింది. ఆ డబ్బులు ఓడిపోవడంతో.. ఇంట్లో ఉన్న 20 సవర్ల నగలను విక్రయించింది. ఆ మొత్తం కూడా పోయింది. దీంతో.. తన చెల్లెలు భారతి, కవిత వద్ద నుంచి రూ.3 లక్షల అప్పు తీసుకుంది. ఆ డబ్బులు కూడా రమ్మీపై పెట్టింది.
ఈ వ్యవహారం భాగ్యరాజ్‌కు తెలియడంతో.. ఆ గేమ్‌కు దూరంగా ఉండమని భార్యకు మందలించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. చూస్తుండగానే ఆమె భారీ అప్పుల్లో కూరుకుపోయింది. ఈ విషయం తన సోదరికి ఫోన్ చేసి చెప్పింది కూడా! ఈ పరిస్థితుల్లో ఆదివారం భర్త లేనప్పుడు రాత్రి తన గదిలో భవాని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా.. ఆన్‌లైన్ రమ్మీ కోసం భవాని రూ. 20 లక్షల మేర డబ్బులు పోగొట్టుకున్నట్టు తేలింది.