పూణె అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. మంగళవారం తెల్లవారుజామున పూణెలో రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్‌లో యువతి(27)పై యువకుడు (36) అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యువతి ఇళ్లల్లో పని చేసే కార్మికురాలు. యథావిధిగా బస్సు ఎక్కేందుకు వస్తే.. వేరే చోట బస్సు ఉందని మాయమాటలు చెప్పి బస్సులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు.. స్నేహితురాలికి చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. మహారాష్ట్రలో మహిళలకు భద్రత కరవైందని ఆరోపించాయి.
ఇది కూడా చదవండి: MLC Kavitha: మా కుటుంబం మీద దాడి తప్ప మరోకటిలేదు.. సీఎంపై కవిత ఫైర్
ఈ ఘటన మహారాష్ట్రలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించి నిందితుడు దత్తాత్రేయ రామ్‌దాస్ గడేగా గుర్తించారు. ఇతనిపై అనేకమైన నేరాలు, కేసులు ఉన్నట్లుగా గుర్తించారు. 2019 నుంచి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. ఇతని కోసం 13 ప్రత్యేకమైన బృందాలను పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. ఫేస్ మాస్క్ ధరించడంతో ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారు. తాజాగా నిందితుడి ఫొటోను విడుదల చేసింది. నిందితుడి ఆచూకీ చెబితే రూ.లక్ష రివార్డ్ అందజేస్తామని పోలీసులు వెల్లడించారు. నిందితుడి కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. రైల్వేస్టేషన్లు, పోలీస్ స్టేషన్లలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Gold Prices: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
మంగళవారం ఉదయం 5.45 నుంచి 6 గంటల మధ్య అత్యాచారం జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు కేవలం 100 మీటర్ల దూరంలోనే ఈ దారుణం జరగడం విశేషం. అయితే నిందితుడు.. ఆమెను చెల్లి అని సంబోధించడంతో నమ్మేసింది. సతారా జిల్లాల్లోని ఆమె తన స్వస్థలానికి వెళ్లేందుకు బస్సు కోసం నిరీక్షిస్తుండగా మాటలు చెప్పి.. ఎవరూ లేని బస్సులోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. సీసీ కెమెరాలో ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే తాను బస్సులోపలికి వెళ్లేందుకు సంకోచించానని.. అయితే లోపల ప్రయాణికులు నిద్రపోతున్నారని అబద్ధం ఆడి తీసుకెళ్లాడని.. అనంతరం డోర్‌లు వేసి అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ముందుగా తనను బస్సు ఎక్కించాక.. అతడు లోపలికి వచ్చి అత్యాచారం చేశాడని పేర్కొంది. అనంతరం వెంటనే బస్సులోంచి దూకేసి పారిపోయాడని వాపోయింది. తన స్నేహితురాలి సూచనతో పోలీసులకు రిపోర్టు చేసినట్లు చెప్పింది.
ఇక ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఇది క్షమించరాని నేరమని.. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ డిమాండ్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా వెంటనే నిందితుడిని పట్టుకుని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: IMD Warning: పలు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఢిల్లీలో కమ్ముకున్న మేఘాలు