Husband locks up wife: కర్ణాటకలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్లుగా భార్యను ఇంట్లో నిర్భందించిన భర్త ఉదంతం తెరపైకి వచ్చింది. మైసూరులో ఈ ఘటన జరిగింది. అయితే, ఆమె తన భర్తపై కేసు పెట్టడానికి నిరాకరించి, తన తల్లిదండ్రుల ఇంట్లో ఉండాలని నిర్ణయించుకుంది. 30 ఏళ్ల మహిళను ఆమె భర్త 12 ఏళ్లుగా ఇంట్లో బంధించి ఉంచాడని ఆమె పేర్కొంది. మరుగుదొడ్డి అవసరాలకు కేవలం గదిలోని ఓ మూలలో చిన్న బాక్సుల్ని ఉపయోగించుకున్నట్లు తెలిపింది. పోలీసులు సాయంతో ఆమె ప్రస్తుతం బయటపడింది.
Read Also: Delhi Crime: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారం..
ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, తన భర్త పని నుంచి ఇంటికి తిరిగి వచ్చే వారకు, స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు ఇంటి బయటే ఉండేవారని, తన భర్త వచ్చాక ఇంట్లోకి వచ్చే వారని ఆమె చెప్పింది. తనకు పెళ్లై 12 ఏళ్లు గడిచాయని, తన భర్త చిత్రహింసలకు గురి చేసేవాడని, కిటికీ నుంచే తన పిల్లలకు ఆహారం ఇచ్చే దానినని తన గోడును వెళ్లబోసుకుంది.
అయితే, మహిళ తాను మూడు నాలుగు వారాలుగా ఇంట్లో ఉన్నట్లు మాత్రమే చెప్పిందని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఆమె కదలికలపై నిషేధం ఉండేదని, భర్త పనికి వెళ్లే సమయంలో ఆమెని ఇంట్లోనే ఉంచి తాళం వేసేవాడని, అతను అభద్రతతో ఉండేవాడని, అతనికి కౌన్సిలింగ్ ఇచ్చామని పోలీసులు తెలిపారు. బాధిత మహిళ అతనికి మూడో భార్య. తన భర్తపై ఫిర్యాదు చేయడం ఇష్టం లేదని, తన తల్లిదండ్రుల ఇంట్లో ఉండి సమస్యను పరిష్కరించుకుంటానని చెప్పింది.