Delhi Crime: సోషల్ మీడియా పరిచయాలు కొంపలు ముంచుతున్నాయి. యువతులను టార్గెట్ చేస్తూ కొందరు వల విసురుతున్నారు. దీంట్లో ట్రాప్ అయిన తర్వాత కానీ తాము ఎంత పెద్ద తప్పు చేశామో తెలియడం లేదు వారికి. సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్ పేరిట పరిచయం పెంచుకుని, ఆ తర్వాత పార్టీలకు, పబ్బులకు ఆహ్వానించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా చోటు చేసుకున్నాయి.
తాజాగా ఢిల్లీలో సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులు ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. దక్షిణ ఢిల్లీలోని మదంగిర్‌కి చెందిన 18 ఏళ్ల యువతిపై మాల్వియా నగర్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను మీరట్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: South Central Railway: దక్షిణ మధ్య రైల్వేలో కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఎంతో తెలుసా..?
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన నిందితులు, యువతిని మదంగిర్ లోని ఒక ప్రాంతానికి పిలిచారు. బైక్‌పై వచ్చిన నిందితులు, ఆమెను బైక్‌పై కూర్చోవాలని బలవంతం చేశారు. దానికి ఆమె నిరాకరించింది. నిందితులు ఇద్దరూ యువతిని బెదిరించి మాల్వీయా నగర్‌కి తీసుకెళ్లారని, అక్కడి భోజనంలో మత్తు మందు కలిపినట్లు యువతి పేర్కొంది. ఆ తర్వాత తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. దీనిపై పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో నిందితులను పట్టుకునేందుకు టీములను ఏర్పాటు చేసి, ఒక టీంని మీరట్‌కి పంపారు. గురువారం రాత్రి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు 19, 21 ఏళ్ల వయసు ఉన్న వారిగా గుర్తించారు. తదుపరి విచారణ జరుగుతున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.