Shocking: హర్యానా హిసార్‌లో సంచలన ఘటన జరిగింది. ఒక గ్రామంలో ఇద్దరు మైనర్లు తమ హెయిర్ కట్ చేసుకోలేదని, క్షమశిక్షణ పాటించడం లేదని స్కూల్ ప్రిన్సిపాల్ తిట్టినందుకు ఏకంగా ఆయనను పొడిచి చంపారు. ప్రిన్సిపాల్‌పై కోపంతో ఇద్దరు విద్యార్థులు ఈ హత్యకు పాల్పడినట్లు హన్సి ఎస్పీ అమిత్ యశ్వర్థన్ తెలిపారు. మరణించిన ప్రిన్సిపాల్‌ని జగ్బీర్ సింగ్ (50)గా గుర్తించారు. గురువారం ఉదయం 10.30 గంటలకు హత్య ఘటన జరిగింది. తీవ్రగాయాలపాలైన ఆయన అక్కడిక్కడే మరణించారు. నిందితులు ఇద్దరూ 12వ తరగతి చదువుతున్నారు.
నార్నాండ్ పట్టణంలో బాస్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. కర్తార్ మెమోరియల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు కటింగ్ చేయించుకుని పాఠశాలకు రావాలని, క్షమశిక్షణ పాటించాలని ప్రిన్సిపాల్ ఆదేశించారు. అయితే, ఇద్దరు విద్యార్థులు హెయిర్ కట్ చేసుకోకపోవడంతో వారిని ప్రిన్సిపాల్ మందలించారు. అయితే, విద్యార్థులు ప్రిన్సిపాల్‌పై ద్వేషం పెంచుకుని కత్తితో పొడిచి చంపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హిసార్ పంపామని, దర్యాప్తు జరుగుతోందని ఎస్పీ వెల్లడించారు.